ఏపీలో మరో నలుగురిపై సీబీఐ చార్జిషీట్

ఏపీలో మరో నలుగురిపై సీబీఐ చార్జిషీట్
  • న్యాయ వ్యవస్థను కించపరిచేలా కామెంట్ చేసినందుకు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయమూర్తులను కించపరిచేలా.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన మరో నలుగురిపై సీబీఐ సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. గత ఏడాదిలో కొందరు రెచ్చిపోయి న్యాయమూర్తులపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన విషయం కలకలం రేపింది. తీవ్ర దుమారం చెలరేగడంతో ప్రభుత్వం స్పందించి కేసు నమోదు చేసి సీబీసీఐడీకి అప్పగించింది. అయితే హైకోర్టులో సీఐడీ విచారణపై అభ్యంతరాలు రావడంతో సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ తమ కంటే ముందు కేసు విచారణ చేపట్టిన సీఐడీ నుంచి వివరాలు తీసుకుని పలువురిపై చార్జిషీటు దాఖలు చేయగా.. ఇవాళ సోమవారం మరో నలుగురిపై రెండోసారి వేరుగా చార్జిషీటు దాఖలు చేసింది. 

ధని రెడ్డి కొండా రెడ్డి, పాముల శ్రీధర్‌, ఆదర్శ్‌ పట్టపు (ఆదర్శ్‌ రెడ్డి) లవనూరు సాంబ శివారెడ్డి (శివారెడ్డి)లపై సీబీఐ అభియోగాలు మోపుతూ చార్జిషీటు దాఖలు చేసింది. ధనిరెడ్డి కొండారెడ్డి ధనిరెడ్డి YSRCP పేరుతో, గుంటూరులో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న పాముల శ్రీధర్ గుంటూరు మెట్రోపొలిస్‌ అనే పేరు ఫేస్‌బుక్‌ అకౌంట్స్‌ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేశారని సీబీఐ పేర్కొంది. కేవలం ఇలాంటి వివాదాస్పద పోస్టుల కోసం ఈ ఖాతాలను ఉపయోగించినట్లు సీబీఐ పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ 12 ఎఫ్‌ఐఆర్ లను నమోదు చేయగా.. వాటి ఆధారంగా గత ఏడాది నవంబర్‌ 11వ తేదీన 16 మందిపై సీబీఐ కేసు పెట్టింది. వైకాపా మద్దతుదారుడైన లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిపై సెప్టెంబర్‌ 2వ తేదీన సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసుల్లో నిందితులను గత జులై 27వ తేదీన అలాగే ఆగస్టు 7వ తేదీన విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.