
నాంపల్లి: ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. 2004-09లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా, సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. సబితా ఇంద్రారెడ్డికి క్లీ్న్ చీట్ ఇచ్చిన సీబీఐ కోర్టు ఐదుగురుని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, బి.వి.శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి పీఏ మెర్ఫూజ్ అలీఖాన్, వి.డి. రాజగోపాల్ను, ఓఎంసీ కంపెనీని దోషులుగా సీబీఐ కోర్టు పేర్కొంది. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది.
ఓబులాపురం మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఓఎంసీ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2009, డిసెంబర్ 7న సీబీఐ కేసు నమోదు చేసింది. 2011లో ఓఎంసీ కేసులో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో 9 మందిని నిందితులుగా సీబీఐ చేర్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి, గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ తొమ్మిది మంది నిందితుల్లో ఉన్నారు.
ఈ ముగ్గురితో పాటు గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, వీడీ రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందంపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత 2025, ఏప్రిల్ నెలతో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసు విచారణను 2025 మే నెలలోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. దీంతో.. కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది.
మే 6, 2025న ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా సీబీఐ చేర్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మికి 2022లోనే ఊరట లభించింది. ఈ కేసులో కొన్ని నెలల పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు జీవితం కూడా గడిపారు. అయితే.. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో తెలంగాణ హైకోర్టు ఆమెపై దాఖలైన ఛార్జ్ షీట్ను కొట్టేసింది.