సీబీఐ, డ్రగ్స్ పేరిట రూ. 48 లక్షలు కాజేశారు

సీబీఐ, డ్రగ్స్ పేరిట రూ. 48 లక్షలు కాజేశారు

 బషీర్ బాగ్,వెలుగు: సీబీఐ ఆఫీసర్లమని ఓ వైద్యురాలిని డ్రగ్స్ పేరిట బెదిరించి సైబర్ చీటర్స్ రూ. 48 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన వైద్యురాలికి వారం రోజుల కిందట ఫిడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పేరుతో మలేషియా నుంచి ఢిల్లీకి డ్రగ్స్ పార్సిల్ వస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత సీబీఐ కానిస్టేబుల్ అంటూ ఆమె వాట్సాప్ కు మరో వీడియో కాల్ వచ్చింది. అందులో అరెస్ట్ వారెంట్ పంపి, కోర్టుకు హాజరు కావాలని తెలిపారు. 

వీడియో కాల్ డిస్కనెక్ట్ చేస్తే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు  రెడీగా ఉన్నారని ఆమెను బెదిరించారు. అనంతరం సీబీఐ సీనియర్ ఆఫీసర్ అంటూ మరొకరు సుమారు 2 గంటల పాటు వాట్సాప్ కాల్ లో విచారించారు. ఆ సమయంలో బాధితురాలి భర్త, కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను తీసుకోవడమే కాకుండా.. డ్రగ్స్ తో పాటు మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 ఆపై వైద్యురాలి అకౌంట్లను వెరిఫై చేసేందుకు కొంత నగదు చెల్లించాలని సూచించారు. అందుకు ఆమె తన ఖాతాలో మూడు వేలు ఉన్నాయని, రెండు ఫిక్సిడ్ డిపాజిట్లలో రూ. 50 లక్షలు ఉన్నట్లు తెలిపింది. వెంటనే ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి రూ. 48 లక్షలు తమకు ట్రాన్స్ ఫర్ చేయాలని, ఆర్బీఐ రూల్స్ మేరకు నగదును వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మించారు. దీంతో  సైబర్ ఫ్రాడ్స్ కు ఆమె నగదును ట్రాన్స్ ఫర్ చేసింది. 

అయితే.. కాల్ డిస్కనెక్ట్ చేయకుండా సైబర్ చీటర్స్ ఆమె కాల్ ను మ్యుట్ లో పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు.