
- దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి రస్తోగీ అధ్యక్షతన కమిటీ
- ఈ ఘటనపై అనుమానాలున్నాయి.. అవి తొలగాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడులోని కరూర్ జిల్లాలో సెప్టెంబర్ 27న టీవీకే చీఫ్, నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు నిష్పాక్షికంగా, న్యాయంగా జరిగేలా పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి మద్రాస్హైకోర్టు నిరాకరించింది.
అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ఎన్.వి.అంజరియాతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ సోమవారం ఈ పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా ‘‘సీబీఐ దర్యాప్తు అవసరంలేదు, సిట్ ఏర్పాటు చేయండి” అని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘సింగిల్ జడ్జి అటువంటి నిర్ణయానికి ఎలా వచ్చారో తన ఆదేశాల్లో పేర్కొనలేదు. ఆ ఉత్తర్వు అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన సమర్పణలను మేరకే ఉంది. ఈ సంఘటనపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లు మధురై బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా పిటిషన్లను విచారించడానికి సింగిల్ జడ్జికి ఎటువంటి అవకాశంలేదు” అని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ తొక్కిసలాట ఘటన దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిందని న్యాయమూర్తులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని.. వాటిని తొలగించడం కోసం సీబీఐ దర్యాప్తు అవసరమని తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో రంగంలోకి ఈడీ
చెన్నై: మధ్యప్రదేశ్‌లో 20 మందికిపైగా చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్ రిఫ్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఆ సిరప్‌ను తయారుచేసిన శ్రేసన్ ఫార్మా ఆఫీసుల్లో, తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (టీఎన్ఎఫ్డీఏ) కీలక అధికారుల ఇండ్లలో సోమవారం ఈడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సోమవారం తమిళనాడులోని కంపెనీ ఏడు ఆఫీసుల్లో సోదాలు జరిపింది.
టీఎన్ఎఫ్డీఏ ఇన్చార్జ్ డైరెక్టర్ పీయూ కార్తికేయన్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కోల్డ్రిఫ్ టానిక్‌లో 48.6 శాతం వరకు డై ఇథైలిన్ గ్లైకాల్ ఉన్నా.. మార్కెట్లోకి దాన్ని విడుల చేయడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తున్నది.