ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ హైకోర్టుకు వెళ్లే అవకాశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ హైకోర్టుకు వెళ్లే అవకాశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సర్కార్ పై లీగల్ యాక్షన్ కు సీబీఐ రెడీ అవుతోంది. ప్రభుత్వం కేసు ఫైల్స్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు కేసు ఫైల్స్ అప్పగించాలని రాష్ట్ర సర్కార్ కు సీబీఐ ఐదుసార్లు లెటర్లు రాసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ నెల 6న సీఎస్ కు రాసిన లెటర్ లో కోర్టు తీర్పులను సీబీఐ ప్రత్యేకంగా పేర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిసింది. దీంతో ఆ లెటర్ల ఆధారంగా కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ భావిస్తోందని, ఆ కేసు ఫైల్స్ సేకరించేందుకు లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకుంటోందని సమాచారం. కాగా, ప్రభుత్వం కేసు ఫైల్స్‌‌‌‌ ఇచ్చినా ఇవ్వకపోయినా సీబీఐ ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం ఉందని లీగల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇందుకు కారణం సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి స్టేలు లేకపోవడమేనని చెబుతున్నారు. సీఎస్‌‌‌‌కు ఐదుసార్లు లెటర్స్‌‌‌‌ రాయడం కూడా సీబీఐ లీగల్ యాక్షన్‌‌‌‌లో భాగమై ఉంటుందని పేర్కొంటున్నారు. 

సుప్రీం తీర్పే కీలకం.. 

సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. హైకోర్టు తీర్పులు తమకు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌‌‌‌ వేసింది. దీనిపై ఈ నెల 17న విచారణ జరగనుంది. అయితే హైకోర్టు తీర్పులను సుప్రీం సమర్థిస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అప్పుడు ఈ కేసును సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఫిర్యాదుదారు ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో చిక్కిన ముగ్గురు నిందితుల స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను సీబీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. సిట్‌‌‌‌ సేకరించిన ఆధారాలు, డిజిటల్ డాక్యుమెంట్లు సహా ఏసీబీ కోర్టులో ఫైల్‌‌‌‌ చేసిన ప్రతి ఫైల్‌‌‌‌ సీబీఐ చేతికి చేరుతుంది. అప్పుడు ఈ కేసులో నిజానిజాలు బయటపడే చాన్స్ ఉంది.