
- 6న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో విచారణకు
- హాజరుకావాలని కోరిన దర్యాప్తు సంస్థ
- హైదరాబాద్‌లోని తన నివాసంలో హాజరవుతానన్న కవిత
న్యూఢిల్లీ, వెలుగు:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షహీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై ఐపీసీ సెక్షన్ 477ఏ కేసు నమోదైందని సీబీఐ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో కవితకు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. తదుపరి దర్యాప్తులో సాక్ష్యాధారాలపై విచారణ అవసరంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అందువల్ల ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని అందులో పేర్కొంది. సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు. తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో తన నివాసంలోనే 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని రిప్లయ్ ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.
సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ప్రస్తావన
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు ఆరుగురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్, తర్వాత ఆప్ కు చెందిన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అమిత్ అరోరాను హాజరుపరిచిన సందర్భంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, సౌత్గ్రూప్ను శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నియంత్రించారని తెలిపింది. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఆప్ నేత విజయ్ నాయర్‌కు ఇచ్చినట్లు వెల్లడించింది. అమిత్ అరోరా తన స్టేట్మెంట్లో ఈ విషయం ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా, వీరిలో తెలంగాణకు చెందిన రాబిన్ డిస్టీలర్స్ లో డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా ఎండి శరత్ చంద్రా రెడ్డిలను దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తిహార్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు కూడా వినిపించింది. అలాగే, బోయినపల్లి అభిషేక్ సౌత్ గ్రూప్ కు రూ.100 కోట్లను చేర్చడంలో ఉన్నట్లు గుర్తించింది. కాగా, అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు రావడంపై సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.