
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 200 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు. బాధితులు గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కలిసి మాదాపూర్ లో కొన్ని నెలల కింద స్కిల్ హబ్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. జాబ్ పోర్టళ్ల ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను సంప్రదించి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నమ్మించారు.
ప్యాకేజీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. గచ్చిబౌలి ప్లాటినం బిల్డింగ్తొమ్మిదో అంతస్తులోని వ్యూరోపోల్ క్రియేటివ్స్ అండ్ ఐటీ సొల్యూషన్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారు. మూడు నెలల ట్రైనింగ్ తర్వాత పర్మినెంట్చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఏడాది బాండ్ రాయించుకున్నారు. రెండు నెలలు ట్రైనింగ్ఇచ్చి, కొంతమందికి వేతనాలు ఇచ్చారు. మరికొందరికి ఇవ్వలేదు.
రోజూ మాదిరిగా మే 7న ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులకు తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు. సెక్యూరిటీని అడగ్గా సదరు కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు చెప్పారు. మోసపోయామని గుర్తించిన నిరుద్యోగులు గురువారం ఆప్రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ తో కలిసి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎంపిక చేసిన స్కిల్ హబ్ కన్సల్టెన్సీ, వ్యూరోపోల్ సంస్థ ఒకే వ్యక్తికి చెందినవని,మాదాపూర్ కు వెళ్లగా కన్సల్టెన్సీ సైతం మూసివేసి ఉందన్నారు.