
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూతురి వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్‌ను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు వరప్రసాద్. అనంతరం దగ్గరుండి వివేక్‌ను పెళ్లి మండపం మీదకు తీసుకెళ్లారు. ఆక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే వివేక్.
ఎమ్మెల్యే వివేక్‌కు ఆంధ్ర రాజకీయ నాయకులతో ఎక్కువగా పరిచయాలు ఉండటంతో ఆయన వస్తున్నారని తెలిసి కళ్యాణ మండపానికి భారీగా తరలివచ్చారు రాజకీయ నాయకులు. ఈ పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే వివేక్‌ను పలువురు ఆంధ్ర నేతలు ఆప్యాయంగా పలకరించారు. సరదగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు ఎమ్మెల్యే వివేక్ ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.