
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం (మే 16) అరెస్ట్ చేశారు. కాగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన సిట్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటింది. ఈ కేసులో అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను సిట్ నిందితులుగా చేర్చింది.
ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను ఏ31, ఏ32 నిందితులుగా సిట్ పేర్కొంది. కేసు విచారణలో భాగంగా గత మూడు రోజులుగా ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ బృందం ప్రశ్నించింది. అనంతరం శుక్రవారం (మే 16) రాత్రి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రకటించింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్పను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ALSO READ | అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి గ్రీన్ సిగ్నల్.. జూన్ 2 వరకే ఛాన్స్..
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాములో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉండటంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.