
- ఇద్దరు వ్యాపారులతోపాటు కస్టమర్లకు టోకరా
కూకట్పల్లి/ జీడిమెట్ల, వెలుగు: గోల్డ్బిజినెస్ పేరుతో ఇద్దరు భార్యాభర్తలు కస్టమర్లతోపాటు ఇద్దరు వ్యాపారులకు భారీ కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు రూ. కోటిన్నర గోల్డ్‌తో ఉడాయించారు. కేపీహెచ్‌బీ కాలనీ రెండో రోడ్డులో రిషబ్ జువెలరీ పేరుతో అశోక్‌కుమార్‌జైన్ అనే వ్యక్తి దాదాపు 30 ఏండ్లుగా గోల్డ్బిజినెస్ చేస్తున్నాడు. నాలుగైదు ఏండ్ల కింద ఇతనికి నిజాంపేట ప్రగతినగర్ లో చేతన్జువెలరీపేరుతో బిజినెస్చేస్తున్న నితీశ్జైన్, అతని భార్య స్వీటీ జైన్పరిచయం అయ్యారు.
వీరిద్దరూ తరచూ అశోక్ కుమార్ షాపు నుంచి బంగారు ఆభరణాలు ఆర్డర్ఇచ్చి తీసుకెళ్లేవారు. వీరి ద్వారా బిజినెస్ బాగా జరుగుతుండడంతో కొన్నిసార్లు వెంటనే డబ్బులుఇవ్వకపోయినా అశోక్ కుమార్ నగలు ఇచ్చేవాడు. కొద్దిరోజుల తర్వాత బాకీ తీసుకునేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్10న 263 గ్రాములు, మే 10న 247 గ్రాముల గోల్డ్ఆభరణాలను నెల రోజుల్లో డబ్బు ఇస్తామని తీసుకెళ్లారు.
ఐడీపీఎల్కాలనీ వద్ద బిజినెస్ చేస్తున్న అశోక్కుమార్బంధువు దీపక్జైన్నుంచి కూడా ఈ భార్యాభర్తలు నెల రోజుల్లో డబ్బు ఇస్తామని 860 గ్రామలు గోల్డ్ ఆభరణాలు తీసుకువెళ్లారు. ఆ తర్వాత దంపతుల ఫోన్ స్వీచ్చాఫ్ రావడం, పత్తా లేకుండా పోవడంతో బాధితులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు గోల్డ్వ్యాపారులకే కాకుండా నిజాంపేటలో కొందరు కస్టమర్లను కూడా నమ్మించి రూ. లక్షలు వసూలు చేయడంతో బాచుపల్లి పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.