
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు శుక్రవారం (మే 16) సరస్వతి పుష్కరాలల్లో పుణ్యస్నానం చేశారు. పుష్కరాలకు వెళ్లిన భట్టి దంపతులకు వేద పండితులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం త్రివేణి సంఘమంలో భట్టి దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత సరస్వతి మాత నదికి ప్రత్యేక పూజలు చేసి పట్టు చీరతో సారే అప్పజేప్పారు. భట్టి సరస్వతి నది హారతి కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. భట్టి పర్యటన నేపధ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ALSO READ | సరస్వతి పుష్కరాల నిర్వహణ గొప్ప వరం: పుష్కర స్నానమాచరించిన సీఎం రేవంత్రెడ్డి
కాగా, గురువారం (మే 15) నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి నదిలో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి పుణ్యస్నానమాచరించారు. తర్వాత ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించి.. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు వైభవంగ జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం సరస్వతి నది పుష్కరాలకు సిద్దమవుతుంది.
తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సిద్దమవుతున్నారు. ఈ పుష్కరాలు కాళేశ్వరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. టెంపుల్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తిని కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
సరస్వతి నది పుష్కరాలు జరిగే ప్రదేశాలు
తెలంగాణా రాష్ట్రంలోని కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలోను సరస్వతీ నదీ పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని "మన" అనే గ్రామంలో పుట్టింది. అయితే ఈ నది అంతర్వాహిని. అందువల్ల సరస్వతి నదీ పుష్కరాలు "మన" లో జరుగుతాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. నదిలో సమృద్ధిగా నీళ్లు ఉండి, పుష్కరాలు విజయవంతంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.