
- మేడారం జాతర.. గోదావరి, కృష్ణా పుష్కరాలనూ వైభవంగా నిర్వహిస్తం: సీఎం రేవంత్
- నదులను దేవుళ్లుగా భావించే సంస్కృతి మనది
- సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం
- కాళేశ్వరం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు
- ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
- కాళేశ్వరం గ్రామంలో సరస్వతి పుష్కరాలు షురూ
- 17 అడుగుల ఏకశిల సరస్వతి విగ్రహం ఆవిష్కరణ
దక్షిణాది రాష్ట్రాల్లో సరస్వతినదీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఏకైక క్షేత్రం కాళేశ్వరం గ్రామంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద మంత్రోచ్ఛారణ మధ్య పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ గురుమదానానంద సరస్వతి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి పుష్కరస్నానాలు ప్రారంభించగా.. వేద పండితులు సరస్వతినదికి ప్రత్యేక పూజలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు తమ హయాంలో రావడం గొప్ప వరంగా భావిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 17 అడుగుల ఏక శిలతో రూపొందించిన సరస్వతి మాత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గోదావరి, ప్రాణహిత నదితో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్న చోట సీఎం రేవంత్ పుష్కరస్నానం చేశారు.
అనంతరం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. సరస్వతి ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత సరస్వతి ఘాట్‌లో సరస్వతి నవరత్నమాల హారతి దర్శనం చేసుకున్నారు. రాబోయే మూడేండ్లలో రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నది పుష్కరాలతో పాటు సమ్మక్క, సారలమ్మ జాతర కూడా వస్తుందని, వీటిని నిర్వహించుకోవడం తమ ప్రభుత్వానికి దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. ‘‘నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదులను మనం దేవుళ్తుగా భావిస్తాం.. నదులను మన దేవాలయాలుగా గుర్తిస్తాం.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం” అని చెప్పారు.
రూ. 200 కోట్లు కేటాయిస్తం
కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు కాళేశ్వరం ఆలయ అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఈ నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనుల మాస్టర్ ప్లాన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ రెడీ చేసుకోవాలని ఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు.
►ALSO READ | రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టండి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భారతదేశం గర్వించదగ్గ లీడర్ పీవీ నర్సింహారావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ‘‘పీవీ నర్సింహారావు మంథని గడ్డపైనుంచి వచ్చి దేశాన్ని అగ్రపథంలో నడిపారు. దేశ ప్రధాని హోదాలో ఆయన చేసిన కృషి వల్లనే మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎదిగింది. త్వరలోనే మూడో స్థానానికి వెళ్తుంది” అని ఆయన తెలిపారు. సరస్వతి పుష్కరాల నిర్వహణ కోసం మూడు నెలలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలు, మేడారం జాతరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.