
భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ/జూలూరుపాడు, వెలుగు : తక్కువపెట్టుబడితో అధికలాభాలు పొందేందుకు రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. గురువారం చండ్రుగొండ మండలం మంగయ్యబంజరు, పోకలగూడెం, రావికంపాడు, జూలూరుపాడు మండలం మాచినేనిపేట, గోపాతండా, దండుమిట్టతండా తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఉపాధి కూలీలతో కలిసి మట్టితవ్వారు. కూలీల హాజరు శాతం, కూలీ గిట్టుబాటు, వసతుల కల్పన లాంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పథకం ద్వారా రైతు సాగు చేస్తున్న మునగ పంట ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలను చైతన్య పర్చాలని ఆఫీసర్లకు సూచించారు. భవిష్యత్ లో నీటి ఎద్దడిని నివారించడానికి ఫామ్ పాండ్ నిర్మాణం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. దండుమిట్టతండాలో ఉపాధి హామీకూలీలతో కలిసి ఆయన స్వయంగా పలుగు, పార చేతబట్టి మట్టి తవ్వి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కలెక్టర్వెంట అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, ఆయా మండలాల అధికారులు ఉన్నారు.
పెండింగ్లో 1,679 భూ భారతి దరఖాస్తులు
భూ భారతి దరఖాస్తులు 1,679 పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ జితేశ్తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టరేట్ నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతి దరఖాస్తుల పెండింగ్ వివరాలను అందజేయాలన్నారు. ఎందుకు పెండింగ్లో ఉన్నాయో నివేదికల్లో వివరించాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పారదర్శకంగా దరఖాస్తులు పరిశీలించాలన్నారు. ప్రజా పాలన, మీ సేవ ద్వారా వచ్చిన రేషన్ కార్డుల పరిశీలనలో, ధాన్యం కొనుగోళ్లలోనూ ఎటువంటి అక్రమాలకు తావుండకూడదని చెప్పారు.