వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఎంపీ అవినాశ్ రెడ్డి ధీమా

వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఎంపీ అవినాశ్ రెడ్డి ధీమా

వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను..చంచల్ గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని పులివెందులో ఏప్రిల్ 16వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేసిన  జడ్జి ఎదుట హాజరుపరిచారు. 

ఏప్రిల్ 26వ తేదీన పులివెందుల్లో  తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి మెమోను  భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130B, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  అరెస్ట్ చేసిన వెంటనే వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. అయితే ప్రస్తుతానికి భాస్కర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టు ఇచ్చింది. అయితే  ఆయన్ను విచారణ కోసం తమ కష్టడీకి ఇవ్వాలని సబీఐ తరుపు న్యాయవాదులు కోరనున్నారు. ఆ తరువాత భాస్కర్ రెడ్డి న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కోరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

వ్యక్తుల ఆధారంగా విచారణ...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు.   వాస్తవాల ఆధారంగా కాకుండా  వ్యక్తుల ఆధారంగా  సీబీఐ  విచారణ నిర్వహిస్తుందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ  కీలకమైన అంశాలను విస్మరిస్తుందన్నారు. గతంలో  విచారణ చేసిన  అధికారి తరహలోనే  కొత్త  సీబీఐ బృందం విచారిస్తోందన్నారు.  ధైర్యం కోల్పోకుండా  తమ నిజాయితీని  నిరూపించుకుంటామన్నారు.  ఏప్రిల్  3న  తాము  అధికారులకు  ఇచ్చిన   అభ్యంతరాలను  సీబీఐ  పట్టించుకోవడం లేదన్నారు.   వివేకానందరెడ్డి  హత్య  విషయాన్ని  పోలీసులకు  చెప్పింది తానేనని  ఆయన  చెప్పారు. ఘటనాస్థలికి  రావాలని  పోలీసులను  మూడు సార్లు కోరినట్టుగా  వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు. 

విచారణలో స్పీడ్..

గతంలో పోలిస్తే వైఎస్ వివేకా హత్యకేసుపై విచారణలో  సీబీఐ మరింత  స్పీడ్ పెంచింది.  వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను  త్వరితగతిన పూర్తి  చేయాలని  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణను మరింత వేగవంతం  చేసింది. ఈ కేసును మరో 15 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే  వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో 14వ తేదీన అవినాష్ ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏప్రిల్ 16వ తేదీన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు..ఈ కేసులో  గతంలో  వైఎస్ భాస్కర్ రెడ్డిని  సీబీఐ విచారించింది. వైఎస్ భాస్కర్  రెడ్డి నివాసాన్ని  కూడా  సీబీఐ బృందం  పరిశీలించింది.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  చేసిన  రోజున  నిందితులు  వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో  ఉన్నారని  సీబీఐ  ఆరోపణ.  గూగుల్ టేకవుట్ ద్వారా ఆధారాలున్నాయని  చెప్పింది.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఉద్దేశ్యపూర్వకంగా   ఈ కేసులో  తమను ఇరికించే  ప్రయత్నం  చేస్తుందని  వైఎస్  అవినాష్ రెడ్డి  ఆరోపించారు.