లిక్కర్ స్కాంలో కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు

లిక్కర్ స్కాంలో కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు దాదాపు 2 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఈ కేసులో కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 CRPC కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు వెళ్తామని సీబీఐ అధికారులు తెలిపారు. తమ అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను ఎమ్మెల్సీ కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. 

హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ ప్రత్యేక టీమ్..ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. సీబీఐ మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు.. న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో సీబీఐ అధికారులకు కవిత స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారీ బందోబస్తు

సీబీఐ విచారణతో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. TRS కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లిక్కర్ కేసులో సీబీఐ విచారణ ఉండటంతో..శనివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తోంది.