దేశంలో ఫుట్బాల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు క్లబ్లు ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫీసుకు వెళ్లిన సీబీఐ అధికారులు..క్లబ్లు, మ్యాచులకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు.
విల్సన్ రాజ్ ప్రమేయం ఉందా..?
దేశంలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ జరిగినట్లు...ఇందులో భారతీయ ఫుట్బాల్ క్లబ్లు భాగమయ్యాయని సీబీఐ అనుమానిస్తోంది. ఫిక్సింగ్లో సింగపూర్ మ్యాచ్ ఫిక్సర్ విల్సన్ రాజ్ పెరుమాల్ ప్రమేయం ఉందని భావిస్తోంది. ఫుట్బాల్ క్లబ్లు, షెల్ సంస్థల ద్వారా ఫిక్సర్ నుంచి నగదు అందుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని క్లబ్లతో అనుసంధానమైన విదేశీ ప్లేయర్లు, సహాయక సిబ్బంది, స్పాన్సర్ల గురించి వివరాలు ఇవ్వాలని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను సీబీఐ కోరింది. అటు విల్సన్ రాజ్ పెరుమాల్..లివింగ్ 3డీ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా దేశంలోని ఫుట్బాల్ క్లబ్లలో పెట్టుబడులు పెట్టాడనే ఆరోపణలపైనా సీబీఐ విచారణ చేస్తోంది. ఇక 1995 సింగపూర్లో జరిగిన ఓ మ్యాచులో విల్సన్ రాజ్ ఫిక్సింగ్కు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.
సీబీఐ విచారణకు సహకరిస్తాం..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందని ఏఐఎఫ్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ షాజీ ప్రభాకరన్ తెలిపారు. ఈ కేసు విచారణకు అన్ని క్లబ్ లు సహకరించాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
