
న్యూఢిల్లీ: ఎస్‌బీఐకి తీర్చాల్సిన రూ.2,929.05 కోట్ల రుణాలను ఎగ్గొట్టారనే ఆరోపణలపై రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) డైరెక్టర్ అనిల్ అంబానీకి చెందిన ముంబైలోని ఇల్లు, ఆఫీస్‌లో సీబీఐ శనివారం సోదాలు జరిపింది. ఆర్‌కామ్, అనిల్ అంబానీ, గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆర్‌కామ్‌కు రూ.40 వేల కోట్లకు పైగా అప్పులు ఉండగా, ఒక్క ఎస్‌బీఐకే రూ.2,929.05 కోట్ల నష్టం ఏర్పడింది.
సీబీఐ ప్రకారం, ఆర్‌కామ్ సంస్థలు రూ.31,580 కోట్ల రుణాలు పొందాయి. 2020లో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ నిధుల వినియోగంలో అనేక అక్రమాలు జరిగాయని తేలింది. రూ.13,667.73 కోట్లు బ్యాంక్ రుణాల చెల్లింపులకు, రూ.12,692.31 కోట్లు సంబంధిత సంస్థలకు చెల్లింపులకు వాడారు. నెటిజన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్రూప్ కంపెనీకి రూ.5,525 కోట్ల క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చి తరువాత రద్దు చేయడం, ఫేక్ ఖాతాలు సృష్టించి డబ్బు మళ్లించడం వంటి అక్రమాలు జరిగాయి.
ఆర్‌జియో ద్వారా ఆర్‌కామ్‌కు వచ్చిన స్పెక్ట్రం అమ్మకాల డబ్బు నెటిజన్ ద్వారా ఆర్థికంగా బలహీనమైన సంస్థలకు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ ఈ కేసులో కుట్ర, మోసం, నమ్మకద్రోహం వంటి నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్‌కామ్ ఎస్‌బీఐ అకౌంట్‌ను 'ఫ్రాడ్'గా వర్గీకరించింది.