కాళేశ్వరం అధికారుల్లో సీబీఐ టెన్షన్.. ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నరు

కాళేశ్వరం అధికారుల్లో సీబీఐ టెన్షన్.. ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నరు
  • హైకోర్టుకు రిటైర్డ్ ​సీఎస్ ​ఎస్కే జోషి.. అదే బాటలో మరికొందరు 

  • ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఆఫీసర్లలోనూ గుబులు 

  • ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్, హరీశ్ పిటిషన్లు

హైదరాబాద్, వెలుగు: 
కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకున్నోళ్లందరికీ సీబీఐ టెన్షన్ పట్టుకున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడంతో.. ఏం జరుగుతుందోనని అటు పొలిటికల్​ లీడర్లతో పాటు ఇటు రిటైర్డ్​ ఆఫీసర్లు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలనే దానిపై మార్గాలు వెతుక్కుంటున్నారు. 

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్​ పీసీ ఘోష్​ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు హైకోర్టుకు వెళ్లగా.. తాజాగా మాజీ సీఎస్​ ఎస్కే జోషి సైతం చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న రిటైర్డ్​ ఆఫీసర్లు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నోళ్లు సైతం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ అంశంలో ఘోష్​కమిషన్ నివేదిక​ఆధారంగా చర్యలు ఉండొద్దని కేసీఆర్, హరీశ్​రావు పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించగా.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ ఎన్డీఎస్ఏ రిపోర్టు పరంగా సీబీఐ ఎంక్వైరీ చేసినా తమందరికీ మళ్లీ నోటీసులు, విచారణ తప్పదని.. ఆ తర్వాత బాధ్యులుగా తేలిస్తే ఏమవుతుందోననే ఆందోళన అధికారుల్లో మొదలైంది.  

మూడు రిపోర్టులు.. ఇప్పుడు సీబీఐ 

ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలపై నేషనల్​డ్యామ్​సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికతో పాటు పూర్తి స్థాయి రిపోర్టును ఇచ్చింది. నిర్మాణంలో లోపాలు, నాణ్యత తనిఖీలు, ప్లానింగ్, డిజైన్​సరిగా లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం చెందినట్లు ఎన్డీఎస్ఏ స్పష్టంగా తెలిపింది. దీంతో పాటు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్​సైతం ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 

ఇందులో రిటైర్డ్​ఐఏఎస్​లు, ఇంజనీర్లు,  ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఏఎస్ ల పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక జస్టిస్​పీసీ ఘోష్ కమిషన్​16 నెలలు విచారణ చేసి 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. వీరితో పాటు అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, సి.మురళీధర్, బి.హరిరామ్, ఎన్.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాస్, ఎ.నరేందర్ రెడ్డి, కె.ఎస్.ఎస్. చంద్రశేఖర్, బసవరాజు, జె. శ్రీదేవి, జి.రమేష్, జె.ఆశీర్వాదం, ఆనాటి ఫైనాన్స్ కార్యదర్శులు, ఇరిగేషన్​సెక్రటరీలు, కేఐపీసీఎల్​బోర్డు సభ్యులపైనా క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. 

ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ మొదలుపెడితే మళ్లీ మొదటి నుంచి అందరిని విచారించనుంది. దీంతో ఆ అధికారులందరూ టెన్షన్​కు గురవుతున్నారు. విజిలెన్స్, ఘోష్​ కమిషన్ నుంచి తప్పించుకున్నామని భావిస్తున్న కొందరు అధికారులు.. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ విషయంలో ఆందోళన చెందుతున్నారు. మాజీ చీఫ్ ఇంజినీర్ సి.మురళీధర్, హరిరామ్ లాంటి వారి పేర్లు విజిలెన్స్​కమిషన్​తో పాటు ఘోష్​ కమిషన్ నివేదికలో రావడంతో ఇప్పటికే ఏసీబీ వాళ్లందరి ఇండ్లలో అక్రమాస్తులను గుర్తించి అరెస్ట్​ చేసింది. సీబీఐ ఎంక్వైరీలో విషయంలో వీళ్లు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

సీబీఐకి సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ.. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించిన అన్ని నివేదికలను సీబీఐకి ఇచ్చింది. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలుపడంతో.. ఆ మేరకు సీబీఐకు స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.