లేఖ రాసినా సీఎస్ స్పందిస్తలే.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ

లేఖ రాసినా సీఎస్ స్పందిస్తలే.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • డాక్యుమెంట్లపై సిట్‌‌ను ఒత్తిడి చేయొద్దన్న కోర్టు
  • ఈ నెల 9కి విచారణ వాయిదా.. వర్చువల్‌‌గా వాదనలు

హైదరాబాద్, వెలుగు: ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన దర్యాప్తు డాక్యుమెంట్లను సిట్ ఇవ్వట్లేదని హైకోర్టుకు సీబీఐ శుక్రవారం తెలిపింది. సీఎస్‌‌‌‌‌‌‌‌ సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసినా స్పందించడం లేదని సీబీఐ తరఫున వాదించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులున్నా సిట్ డాక్యుమెంట్లు ఇవ్వలేదని, వాటిని ఇస్తే సీబీఐ విచారణ మొదలుపెడుతుందని కోర్టుకు తెలిపారు. ఫైల్స్ ఇవ్వాలంటూ సీబీఐ ఒత్తిడి తెస్తున్నదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

స్పందించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీల తో కూడిన డివిజన్ బెంచ్.. డాక్యుమెంట్లపై సిట్‌‌‌‌‌‌‌‌ను ఒత్తిడి చేయొద్దని సీబీఐకి సూచించింది. అప్పీల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారిస్తున్నందున సీబీఐ వాదనను వింటామని, తదుపరి విచారణ జరిగే 9వ తేదీ వరకు డాక్యుమెంట్లను సీబీఐ అడగకూడదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, సోమవారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారని కోర్టుకు ఏజీ బి.ఎస్.ప్రసాద్ వివరించారు. సోమవారం విచారణను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలో జరపాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు.. వర్చువల్ పద్ధతిలోనే సోమవారం మధ్యాహ్నం విచారణ జరుపుతామని ప్రకటించింది.