
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్‌లో నియోజకవర్గ అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని బీటీ రోడ్ల రిపేర్లకు ఫండ్స్ మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. సిద్దిపేటలోనే ఆయిల్పామ్ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేసుకోబోతున్నందున ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభించాలని సూపరింటెండెంట్కిశోర్ను మంత్రి ఆదేశించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు మంత్రి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని రోగులు హైదరాబాద్ కి వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందాలనే విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ రోజా, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ మాణిక్య రెడ్డి, జడ్పీటీసీలు శ్రీహరి గౌడ్, ఉమ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.