
- షుగర్, హై బీపీ, ఎనీమియా, తామర,
- పైల్స్, కిడ్నీ స్టోన్స్‌కు పసుపుతో మెడిసిన్స్
- మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన సీసీఆర్ఏఎస్
- పసుపు ఔషధ గుణాలపై ఐసీఏఆర్, ఐసీఎంఆర్ స్టడీ
- పసుపు, దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ
- లివర్, కిడ్నీల్లో టిష్యూ పునరుద్ధరణకూ ఉపయోగం
- లోక్‌సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మన వంటిల్లే ఔషధశాల.. ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్యౌషధం అంటుంటారు మన పెద్దలు. నిత్యం మనం వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయోటిక్ పదార్థమని, ఇది రోగనిరోధకతనూ బలోపేతం చేస్తుందని.. ముఖ వర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు. అయితే, పసుపుతో షుగర్, హైబీపీ, మైగ్రెయిన్ని కంట్రోల్ చేయొచ్చని, ఎనీమియా, సోరియాసిస్, కంటి వాపును నివారించొచ్చని.. పైల్స్‌ను నయం చేయొచ్చని, కిడ్నీలో రాళ్లనూ కరిగించొచ్చని సీసీఆర్ఏఎస్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్‌లలో తేలింది.
అంతేకాదు.. పసుపుతో15 వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణకుగాను మొత్తం 22 మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) సంస్థ తయారు చేసింది. ఈ ఏడాది మార్చి వరకు పసుపు ప్రధాన కాంపొనెంట్‌గా తయారు చేసిన ఈ 22 ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ కూడా చేయగా.. మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు సమగ్ర సమాచారంతో సమాధానం ఇచ్చింది.
పసుపు ఔషధ గుణాలు, అందులోని ఫైటోకెమికల్స్, ఫార్మకాలజికల్ రీసెర్చ్, బయో యాక్టివిటీస్, దుష్ప్రభావాలతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఓ మోనోగ్రాఫ్ తయారు చేసిపెట్టింది. పసుపుపై చేసిన వివిధ పరిశోధనలనూ అందులో పొందుపరిచింది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద పనిచేసే అగార్కర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఏఆర్ఐ), సీసీఆర్ఏఎస్ సంస్థలు పసుపు ఔషధ విలువలపై అధ్యయనాలు చేశాయి. 15 జబ్బులను నయం చేసేందుకు సీసీఆర్ఏఎస్ 22 ఫార్ములేషన్స్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ లో పరీక్షించింది. ఆ పరీక్షల్లో మంచి ఫలితాలూ వచ్చాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఆయా జబ్బులపై పసుపు సమర్థవంతంగా పనిచేసినట్టు అధ్యయనంలో సీసీఆర్ఏఎస్ గుర్తించింది.
అన్ని వెరైటీలపైనా ఐఐఎస్ఆర్ స్టడీ..
దేశంలో ప్రస్తుతం వివిధ రకాల పసుపు వంగడాలు అందుబాటులో ఉన్నాయి. కుర్క్యుమిన్ కంటెంట్ 5 శాతానికిపైగా ఉన్న పసుపు వంగడాలను వివిధ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ఐఐఎస్ఆర్ ప్రతిభ, ఐఐఎస్ఆర్ ప్రగతి, అళెప్పీ సుప్రీమ్, రోమా, రాజేంద్ర, సోనియా వంటి వెరైటీలను కేరళ, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. వాటితో పాటు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) గుర్తింపున్న లకడోంగ్, మహారాష్ట్రకు ప్రత్యేకమైన వైగాన్ వంటి పసుపు వంగడాలపై ఐఐఎస్ఆర్ రీసెర్చ్ చేసింది. ఈ వెరైటీలను అత్యధికంగా పండించేందుకు కేంద్రం కూడా ఎలాంటి ఆంక్షలు విధించకుండా ప్రోత్సహిస్తున్నది.
పసుపు ఔషధాలపై రీసెర్చ్ కు ల్యాబ్‌లు..
పసుపు ఔషధాలపై రీసెర్చ్ చేసేందుకు మెరుగైన మౌలిక వసతులను కేంద్రం కల్పిస్తున్నది. ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పాటుతోపాటు పసుపులోని అత్యంత నాణ్యమైన మూలకాలను విశ్లేషించి ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు అత్యాధునిక ల్యాబ్ లను ఐఐఎస్ఆర్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ కేంద్రాలూ ఉన్నట్టు పేర్కొంది. పుణేలోని అగార్కర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్.. ప్రత్యేకంగా మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసుకున్నది. టిష్యూ కల్చర్, మాలిక్యులార్ బయాలజీ, ఫైటోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్స్‌లో రీసెర్చ్ కొనసాగిస్తున్నది.
పసుపు, దాల్చిన చెక్కతో షుగర్‌కు చెక్..
వివిధ జబ్బులపై పసుపు ప్రభావాన్ని తెలుసుకునేందుకు కోజికోడ్‌లోని ఐసీఏఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్(ఐఐఎస్ఆర్) మరిన్ని లోతైన అధ్యయనాలను చేసింది. పసుపు, దాల్చిన చెక్క కలగలిసిన ఔషధంతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమవుతున్నట్టు గుర్తించింది. జంతువులకు వివిధ మోతాదుల్లో ఆ రెండు ఎక్స్‌ట్రాక్ట్‌ల మిశ్రమాన్ని ఇచ్చి పరీక్షించింది. యానిమల్ మోడల్లో కిలో బరువుకు150 మిల్లీగ్రాముల చొప్పున డోసులు ఇచ్చి టెస్ట్ చేసి చూడగా.. రక్తంలోని షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు తేల్చింది.
అంతేకాదు.. రక్తంలోని కొవ్వును కూడా ఇది కరిగించిందని గుర్తించింది. దాంతోపాటు క్లోమం(పాంక్రియాస్) నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా సమర్థంగా పనిచేసేలా మార్చినట్టు నిర్ధారించింది. కాలేయం, మూత్రపిండాల్లో చనిపోయిన లేదా పాడైన కణజాలాన్ని పునరుద్ధరించినట్టు కూడా స్టడీల్లో తేలింది. లివర్ పనితీరును సైతం మరింత మెరుగుపరిచినట్టు ఐసీఏఆర్ స్టడీలో వెల్లడైంది. లివర్ లో జరిగే మెటబాలిజానికి ముఖ్యమైన ఎంజైములు.. మరింత సమర్థంగా పని చేయడంలో పసుపు అత్యంత కీలక పాత్ర పోషించినట్టు తేలింది. శరీర ఎదుగుదలకూ పసుపు ఉపయోగపడుతున్నట్టు స్టడీ నిర్ధారించింది.
వివిధ రోగాలకు సీసీఆర్ఏఎస్ తయారుచేసిన పసుపు ఫార్ములేషన్స్..
వ్యాధి/ సమస్య మందు
01. డయాబెటిస్ సప్తవింశాటిక గుగ్గులు, హరిద్ర చూర్ణ, నిశ ఆమలకి చూర్ణ, చంద్రప్రభా వటి, నిషాకటకాది కషాయ
02. హై బీపీ అశ్వగంధ ద్యరిష్ట
03. రక్తహీనత పునర్నవాది మండ్యూరా
04. మైగ్రెయిన్ పత్యాది క్వత చూర్ణ
05. సోరియాసిస్ పంచతిక్త గుగ్గులు ఘృత,
బృహన్మరీచాద్య తైల,
నల్పమరాది తైలం
06. అజీర్తి/ కడుపులో మంట (గ్యాస్) పిప్పాలద్యాసవ
07. కంజక్టివైటిస్ (కంటి సమస్య) హరిద్రఖండ
08. కాగ్నిటివ్ డెఫిసిట్ కల్యాణక ఘృత
09. ఎగ్జిమా (తామర) నల్పమరాది తైలం
10. పైల్స్ (ఫిషర్స్) జట్యాది ఘృత, జట్యాది తైలం
11. హైపర్యూరిసీమియా
(రక్తంలోయూరియా) నింబాది చూర్ణ
12. మెంటల్ రిటార్డేషన్ బ్రహ్మ రసాయన
13. రసాయన (శరీర పునరుజ్జీవ చికిత్స) బ్రహ్మ రసాయన
14. కిడ్నీలో రాళ్లు చంద్రప్రభా వటి
15. మొటిమలు నింబాది చూర్ణ