సాహితీ ఇన్ ఫ్రా బాధితులకు.. సీసీఎస్ పోలీసుల భరోసా

సాహితీ ఇన్ ఫ్రా బాధితులకు.. సీసీఎస్ పోలీసుల భరోసా

హైదరాబాద్,వెలుగు : ప్రీ లాంచింగ్ మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్ ఫ్రా కేసులో హైదరాబాద్ సిటీ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో రూ.1800 కోట్లు మోసం జరిగినట్లు నిర్ధారించారు.3500 మందికిపైగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు న్యాయం చేసేందుకు హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ శనివారం భేటీ అయ్యారు. బషీర్ బాగ్ లోని ఓల్డ్ కమిషనరేట్ లో దాదాపు 400 మంది బాధితులతో ఆయన చర్చించారు. అనంతరం వివరాలను జాయింట్ సీపీ రంగనాథ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో సాహితీ ఇన్ ఫ్రా ఓ హౌసింగ్ ప్రాజెక్టు  చేపట్టింది. 32 ఫ్లోర్లతో 10 హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. 

ప్రీ లాంచ్, ఆఫర్స్ పేరుతో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ చేసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ప్రీ లాంచ్ ప్రారంభించింది. 2019 జూన్ వరకు 1,752 మందిపైకి పైగా కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేసింది. ఇలా 9 ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3500 మంది వద్ద రూ.1800 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసింది. అయితే, ప్రీ లాంచ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. తీసుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. సంస్థ ఎండీ బూడటి లక్ష్మీనారాయణతో పాటు మొత్తం 22 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేసింది. ఇక బాధితులకు భరోసా ఇచ్చేందుకు జాయింట్ సీపీ రంగనాథ్ చర్యలు చేపట్టారు.ఈడీతో కలిసి సాహితీ ఇన్ ఫ్రా ఆస్తులు అటాచ్ మెంట్, వాటిని విక్రయించిన తర్వాత డిపాజిటర్లకు అందించాల్సిన డబ్బుసేకరణపై ఫోకస్ పెట్టారు. బాధితులకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లనునియమించారు.