- జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బీఆర్ఎస్లో హరీశ్కు పెరిగిన ప్రాధాన్యం
- పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నుంచి సిద్దిపేట జిల్లా దాటనియ్యని గులాబీ బాస్
- తాజాగా జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు జిల్లాల బాట పట్టారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆ గండాల నుంచి గట్టెక్కించి ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. మరోమారు అదే పాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి భంగపాటు తర్వాత గులాబీ పెద్దలు.. హరీశ్‌రావునే రంగంలోకి దించారు. అందులో భాగంగానే హరీశ్ రావు జిల్లాల టూర్లు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
వాస్తవానికి కవిత ఎపిసోడ్‌కు ముందు వరకూ హరీశ్‌ను పార్టీ కార్యకలాపాల్లో గులాబీ బాస్ ఇన్వాల్వ్ చేయలేదన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇన్చార్జిగా తొలుత హరీశ్ రావునే కేసీఆర్ నియమించినా.. అనూహ్యంగా తప్పించారు. వరంగల్ జిల్లా నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆపైహరీశ్ను సిద్దిపేట జిల్లాకే కేసీఆర్ పరిమితం చేశారు. ప్రస్తుతం పార్టీకి నష్టం కలుగుతున్న తరుణంలో.. హరీశ్‌ను జిల్లాల టూర్కు వెళ్లాలని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఆయనతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మంగళవారం ఆదిలాబాద్‌కు వెళ్లారు.
వరుస ఓటములతో కేడర్ నారాజ్
పార్టీ ఎదుర్కొంటున్న వరుస ఓటములతో కేడర్ నిరాశలోకి వెళ్లింది. పెద్ద లీడర్లు జనాల్లోకి వెళ్లడం లేదని, ఇలాగైతే నష్టం తప్పదని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సిటీలో రెండు సిట్టింగ్ సీట్లను కోల్పోవడం పెద్ద మైనస్‌అని అంటున్నారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు తాజాగా రంగంలోకి దిగారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. మంగళవారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు.
పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న సీసీఐ తీరును ఎండగట్టారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో రైతుల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో తగిలిన గట్టి దెబ్బతోనే హరీశ్‌రావుకు కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, అవసరం తీరాక హరీశ్‌రావును పక్కన పెట్టరు కదా? అని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.
బీజేపీ మంత్రులు, ఎంపీల కంటే.. పొలాల్లో దిష్టిబొమ్మలు నయం: హరీశ్
వరంగల్/వరంగల్ సిటీ/మహబూబాబాద్, వెలుగు: బీజేపీ మంత్రులు, ఎంపీల కంటే.. పంట పొలాల్లో దిష్టిబొమ్మలు చాలా నయమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. రైతుల పక్షాన మాట్లాడకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను హరీశ్‌రావు సందర్శించారు.
పత్తి రైతులను ఆగం చేస్తున్న కపాస్ యాప్‌ను రద్దు చేయాలని, రైతుల నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరాదిన గోధుమకు మద్దతు ధర పెంచుకొని.. దక్షిణాదిన పండే వడ్ల ధరను తగ్గిస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసి సీసీఐ నిబంధనలు మార్చేలా చూడాలని కోరారు. కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్‌లో మక్క రైతులతో మాట్లాడారు.
