రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా రామ్ కడుముల దర్శకత్వంలో మాధవి, ఎంఎస్‌ఎమ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పాంచ్ మినార్’. నవంబర్ 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో రాజ్ తరుణ్ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ ‘ఇదొక పూర్తిస్థాయి క్రైమ్ కామెడీ సినిమా. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుని ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది స్టోరీ లైన్. నా పాత్ర ఎంతగా నలిగిపోతుంటే ప్రేక్షకులకు అంతగా నవ్వొస్తుంది. జానర్‌కు తగ్గట్టుగా ప్రతి సీన్‌లోనూ ఫన్ ఉంటుంది.
క్రైమ్ చుట్టూ తిరిగే స్టోరీ అయినప్పటికీ ఫ్యామిలీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. దర్శకుడు జానర్ నుంచి బయటికి రాకుండా స్క్రీన్ ప్లేని చాలా అద్భుతంగా రాశారు. అలాగే నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టుకున్నారు. నా గత చిత్రాలు అనుకున్నంత రీచ్ రాకపోడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంతేతప్ప నేను ఎంచుకున్న ప్రతి కథలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఇటీవల ప్రారంభమైన ‘టార్టాయిస్’ చక్కని థ్రిల్లర్. అలాగే ‘రామ్ భజరంగ్’ చిత్రం హై యాక్షన్‌తో ఉంటుంది’ అని చెప్పాడు.
