- సాయి బాలాజీ రైస్ మిల్లు సీజ్
కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్‌లో వేలాది క్వింటాళ్లను పక్కదారి పట్టించినట్లు గుర్తించిన అధికారులు ఆసిఫాబాద్జిల్లాలోని ఓ రైస్ మిల్లును సీజ్‌చేశారు. ఈనెల 15న విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సిర్పూర్ (టి) మండలం వెంకట్రావ్‌పేట్ వద్ద ఉన్న శ్రీసాయి బాలాజీ రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీ చేశారు.
సీఎంఆర్కోసం ప్రభుత్వం అందించిన వడ్లలో 43,190 బస్తాలు రైస్ మిల్లులో కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సిర్పూర్(టి) తహసీల్దార్ రహీముద్దీన్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు ధోనీ శ్రీనివాస్, రాజ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేపట్టారు.
మిల్లులో 17,275 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేల్చారు. వెంటనే రైస్ మిల్లు సీజ్ చేశారు. దారి మళ్లిన ధాన్యం విలువ రూ.4.46 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మిల్లుకు గ్యారంటర్ గా ఉన్న మరో రైస్ మిల్లు యజమానికి ప్రస్తుతం మిల్లులో ఉన్న ధాన్యం, బియ్యాన్ని కస్టోడియన్ గా ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మిల్లు సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు.
