జన్నారం, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఈ నెల23న నిర్వహిస్తున్న అదివాసీల ధర్మయుద్ధం మహాసభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ మండల ప్రెసిడెంట్ సిడం కాళీ, రాయిసెంటర్ సార్మేడి పూసం సోనేరావు కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో 9 అదివాసీ సంఘాల నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లంబాడీల వల్ల అదివాసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఎస్టీ జాబిత నుంచి తొలగించాలనే డిమాండ్ తో ధర్మయుద్ధం మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాజ్ గొండ్ సేవా సమితి మండల ప్రెసిడెంట్ ఆడాయి హన్మంతరావు, అదివాసీ సేన మండల ప్రెసిడెంట్ దుర్వ యశ్వంత్ రావు, తోటి సంఘం స్టేట్ సెక్రటరీ పెందోర్ రాజేశ్వర్, ప్రధాన్ సంఘం నాయకుడు కుర్సింగ శ్రీనివాస్, కొలం సంఘం నేత కొడప ఆనంద్, నాయక్ పోడ్ సంఘం నేత రాజేశ్వర్, మండల అదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
బెజ్జూర్ లో..
కాగ జ్ నగర్, వెలుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల 23న ఉట్నూర్ లోని ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
బెజ్జూర్ లోని ఆదివాసీ భవనంలో ధర్మ యుద్ధం పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం మండలాధుక్షుడు తిరుపతి, గౌరవ అధ్యక్షుడు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్సింగ ఓంప్రకాశ్, సార్మేడి కొడప శంకర్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళా అధ్యక్షురాలు ఎనుకా అమృత తదితరులు పాల్గొన్నారు.
