రైతులపై కేటీఆర్ మొసలి కన్నీరు : ఎమ్మెల్యే పాయల్ శంకర్

రైతులపై కేటీఆర్ మొసలి కన్నీరు :  ఎమ్మెల్యే పాయల్ శంకర్
  •     రైతుల ముసుగులో ఆరోపణలు చేస్తున్న బీఆర్​ఎస్​నేతలు
  •     మండిపడ్డ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం పోయాక రైతుల పక్షాన పోరాడుతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆదిలాబాద్​ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. 

మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. 

వేల కోట్ల నిధులను వెచ్చించి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేస్తోందన్నారు. గత 12 ఏళ్లుగా సీసీఐ కొనసాగిస్తున్న నిబంధనలే ఇప్పుడు కొనసాగుతున్నాయని, అందులో ఎలాంటి మార్పు లేదన్నారు. సీసీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని కేవలం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తూ రైతులను పక్కతోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలతోనే రైతుల ముసుగులో మాట్లాడించి కేంద్ర ప్రభుత్వంపై, సీసీఐ సంస్థపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకులు దయాకర్, లాలా మున్నా, సంతోష్, క్రాంతి, దినేశ్ మటోలియా, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, భీంసేన్ రెడ్డి, మోహన్ అగర్వాల్, శ్రీనివాస్ యాదవ్, కేశవ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులకు మహిళ సంఘాలు సహకరించాలి

ఆదిలాబాద్, వెలుగు: ఇందిరమ్మ  లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునేందుకు మహిళా సంఘాల సభ్యులు సహకరించాలని పాయల్ శంకర్ కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులతో రివ్యూ నిర్వహించారు. 

ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుల వద్ద డబ్బులు లేకుంటే మహిళా సంఘాలు సహకరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి రాజకీయాలు లేకుండా లబ్ధిదారులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్  రాజు పాల్గొన్నారు.