- జడ్చర్ల మండలం గొల్లపల్లి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
జడ్చర్ల, వెలుగు: జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలోని సలాసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంగళవారం కార్మికులు పత్తి నుంచి విత్తనాలు వేరు చేసిన దూదిని బేల్స్ చుడుతుండగా, కరంట్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చేలరేగాయి.
అదే సమయంలో మిల్లు నుంచి గాలి బయటకు వెళ్లే పైపు లైన్ లో చెత్తను ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు(26), బిహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్(23) తొలగిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో వీరిద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మృతులిద్దరికీ ఇటీవలే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. ప్రమాదం అనంతరం బిహార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీలు మిల్లు యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, యజమాన్యంపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను రప్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.
