పులుల జాడ కోసం పెట్టిన .. సీసీ కెమెరా ధ్వంసం

పులుల జాడ కోసం పెట్టిన .. సీసీ కెమెరా ధ్వంసం
  • మెమరీ కార్డు సైతం చోరీ
  • దర్యాప్తు చేస్తున్నామన్న ఫారెస్ట్ ​అధికారి
  • గాలిస్తున్న పులుల్లో రెండు పిల్లల జాడ గుర్తింపు ?

కాగజ్ నగర్, వెలుగు :  కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ రేంజ్ ​పరిధిలో రెండు పులుల మృతితో హైరానా పడుతూ మిగతావాటి జాడ కోసం వెతుకుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు అనుకోని ఘటనతో తల పట్టుకున్నారు. రేంజ్ పరిధిలోని దరిగాం అడవిలో ఎస్–6 తల్లి పులితో పాటు మరో మూడు పులి పిల్లల జాడ కోసం అధికారులు 15 రోజుల క్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే  ఆ సీసీ కెమెరాల్లో ఒకదాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. పులి కదలికలను తెలుసుకునేందుకు సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించేందుకు వెళ్లగా ఓ కెమెరా పగలగొట్టి ఉంది.

అందులోని మెమరీ కార్డును సైతం చోరీ చేసినట్లు గుర్తించారు. పులుల వేట కోసం వచ్చిన వేటగాళ్లు ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదంటే వేరే వ్యక్తులు ఎవరైనా చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టిబ్రేవాల్​ను వివరణ కోరగా..సీసీ కెమెరాను ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇదిలావుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు గాలిస్తున్న నాలుగు పులుల్లో ఇప్పటివరకు రెండు పులి పిల్లల అడుగులు గుర్తించినట్లు సమాచారం. తల్లి, మరో పిల్ల జాడ ఇంకా తెలియరాలేదని తెలిసింది.