యూట్యూబ్​లో చూసి చైన్​స్నాచింగ్​కు యత్నం.. యువకుడిని అరెస్ట్ చేసిన పోచంపల్లి పోలీసులు

యూట్యూబ్​లో చూసి చైన్​స్నాచింగ్​కు యత్నం.. యువకుడిని అరెస్ట్ చేసిన పోచంపల్లి పోలీసులు

ఎల్​బీనగర్, వెలుగు: ఆన్​లైన్ గేమ్స్​లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పు తీర్చేందుకు చైన్ స్నాచింగ్​కు యత్నించిన యువకుడిని పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్​ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావికి చెందిన చిడుగుల నరేశ్(30) ఆన్​లైన్​లో బెట్టింగ్​పై రమ్మీ ఆడేవాడు. అందులో నష్టపోయి రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పును తీర్చేందుకు చైన్​స్నాచింగ్ లకు స్కెచ్ వేశాడు.

యూట్యూబ్​లో చైన్ స్నాచింగ్ వీడియోలు చూశాడు. ఈ నెల 7న మధ్యాహ్నం 2.30 గంటలకు నరేశ్ ​పోచంపల్లిలోని జిబ్లక్ పల్లికి బైక్​పై వచ్చాడు. ఆ ఏరియాలో రోడ్లు ఊడుస్తున్న లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును లాక్కునే యత్నంలో గొలుసు తెగి కిందపడిపోయింది. లక్ష్మమ్మ గట్టిగా అరవడంతో నరేశ్​అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నరేశ్​ను గుర్తించి అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.