కంటోన్మెంట్, వెలుగు: క్యాబులో పోగొట్టుకున్న రూ.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు గంటల వ్యవధిలో బాధితులకు అప్పగించారు. బొల్లారం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన ఫణి గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బొల్లారానికి క్యాబ్ లో వెళ్లాడు.
25 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు, ల్యాప్‌టాప్ అందులోనే మరిచిపోయాడు. బాధితుడు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నల్లకుంటకు చెందిన జబ్బార్ ను క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించారు. వెంటనే అతడికి ఫోన్ చేసి పోగొట్టుకున్న వస్తువులను తెప్పించారు. బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌ను తిరిగి బాధితులకు అప్పగించారు.
