గాంధీభవన్‌‌లో కాంగ్రెస్ సంబురాలు.. సీఎం రేవంత్‌‌ అంటూ నినాదాలు

గాంధీభవన్‌‌లో కాంగ్రెస్ సంబురాలు.. సీఎం రేవంత్‌‌ అంటూ నినాదాలు

హైదరాబాద్, వెలుగు :  పదేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో గాంధీ భవన్‌‌ కిక్కిరిసిపోయింది. ఓట్ల లెక్కింపు మొదలైన ప్పట్నుంచే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో ఉదయం నుంచే గాంధీ భవన్‌‌కు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అభ్యర్థుల లీడ్ పెరుగుతున్నకొద్దీ గాంధీ భవన్‌‌లో సంబరాల జోరు కూడా ఊపందుకుంది. డీజే పాటలు, డ్యాన్సులతో  కార్యకర్తలు హుషారెత్తించారు. పటాకులు పేల్చి, రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకున్నారు. 'కాంగ్రెస్‌‌, సోనియా, రాహుల్‌‌ గాంధీ జిందాబాద్‌‌' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమైన తర్వాత, జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి ర్యాలీగా గాంధీ భవన్‌‌కు చేరుకున్నారు. అప్పటికే గాంధీ భవన్‌‌ లోపల, బయట కార్యకర్తలతో కిక్కిరిసింది. రేవంత్‌‌ రాగానే సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. రేవంత్‌‌ అభిమానులకు అభివాదం చేస్తూ, షేక్ హ్యాండ్స్‌‌ ఇస్తూ భవన్ లోపలికి వెళ్లారు.

రేవంత్ ఇంటి వద్ద సందడి

గాంధీ భవన్‌‌ తరహాలోనే జూబ్లీహిల్స్‌‌లోని రేవంత్‌‌ రెడ్డి ఇంటి వద్ద కూడా ఉదయం నుంచే సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. రేవంత్‌‌తో పాటు ర్యాలీగా గాంధీ భవన్‌‌కు వచ్చారు. డీజీపీ అంజనీకుమార్‌‌, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్ ఇంటికి వెళ్లి ఆయనకు పూల బొకేలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పోలీస్ ప్రొటెక్షన్, ఇతర విషయాలపై రేవంత్‌‌తో చర్చించారు.