మామూలుగా పిజ్జా అంటే వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటి అద్దె కంటె ఎక్కువ ధరకు పిజ్జా కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని బ్రూక్ అనే పిజ్జా తయారు చేసిన చెఫ్ ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. తన సెలబ్రెటీ క్లయింట్ రాత్రి డిన్నర్ కోసం 2వేల డాలర్ల అంటే రూ. 1.63 లక్షల విలువైన పిజ్జాను ఆర్డర్ చేశారని చెప్పారు.
బ్రూక్ షేర్ చేసిన ఈ వీడియోలో పిజ్జా కోసం వివిధ పదార్ధాలను షాపింగ్ చేస్తున్నట్టుగా చూపించారు. ఈ పిజ్జాలో సేంద్రీయ ఉత్పత్తులను వాడినట్టు తెలుస్తోంది. బాదం, గ్లూటెన్-రహిత పిండి మిశ్రమాలు కొనుగోలు చేసినట్టు ఈ వీడియోలో చూడవచ్చు. వీటితో పాటు న్యూజిలాండ్ నుంచి 250డాలర్ల విలువైన ఆర్గానిక్ తేనె, 200డాలర్ల విలువైన కేవియర్ ను రవాణా చేసుకున్నట్టు బ్రూక్ వెల్లడించారు.
టిక్ టాక్ లో షేర్ చేసిన ఈ వీడియోలో.. పిజ్జా తయారీ వెనుక చోటుచేసుకున్న పరిణామాలను చూడవచ్చు. ఈ పిజ్జాలో పలు పదార్థాలతో పాటు 24 క్యారెట్ల బంగారు రేకులు ఉన్న వేగన్ పేస్ట్ ను యాడ్ చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. దీంతో పాటు జీడిపప్పు, బాదం, తేనె.. లాంటి పలు మిశ్రమాలు పిజ్జాకు మరింత రుచిని తెచ్చేవిగా ఉన్నాయి. తన సెలబ్రెటీ క్లయింట్ కు బ్రూక్ పిజ్జాను అందిస్తున్నట్టు కూడా వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ పిజ్జా తాను కడుతున్న ఇంటి అద్దె కంటె ఎక్కువ అని ఒకరు కామెంట్ చేయగా.. ధనవంతులు తమ డబ్బును ఖర్చు చేయడానికి ఇలా పనికిరాని ఉపాయాలు చేస్తారని మరికొందరు రిప్లై ఇస్తున్నారు.