విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

అన్నమయ్య జిల్లా: విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‎లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్ లైన్ క్లాసులు, ఇతర అవసరాల కోసం తనూజ్ మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. 

ఓవర్ హీట్ కారణమో.. మరి ఇంకేంటో తెలియదు కానీ.. గురువారం (మే 22) జేబులో ఉన్న సెల్ ఫోన్ ఉన్నట్లుండి ఒక్కసారిగా పేలింది. దీంతో తనూజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తనూజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 

యువకుడి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ అయ్యే వరకు చార్జింగ్ పెట్టకూడదని.. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఓవర్ హీట్ అయితే జేబుల్లోంచి తీసి కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టాలని సూచిస్తున్నారు.