- సెన్సస్- 2027లో సెల్ఫ్ ఎన్యూమరేషన్
- అధికారులు ఇంటికి రాకముందే ‘స్వయం నమోదు’కు చాన్స్
- 15 రోజుల ముందే వివరాలు అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు
హైదరాబాద్, వెలుగు: తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ విధానం మారుతోంది. ఇకపై ఎన్యూమరేటర్ల (గణాంక సిబ్బంది) కోసం ఇంటి దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వివరాలను, కుటుంబ సభ్యుల సమాచారాన్ని మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకోవచ్చు.
‘సెన్సస్ -2027’లో భాగంగా పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. అధికారులు ఇంటింటికి వచ్చి సర్వే మొదలుపెట్టడానికి 15 రోజుల ముందే.. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌లో ప్రచురించింది. జనాభా లెక్కల చట్టం-1948 ప్రకారం.. ‘సెన్సస్ -2027’కు సంబంధించిన ఇండ్ల జాబితా సేకరణ షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ సీఎస్ కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన సమయంలో 30 రోజుల పాటు ఈ క్షేత్రస్థాయి ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది.
టెక్నాలజీకి పెద్దపీట..
గతంలో మాదిరిగా పేపర్, పెన్నుతో కాకుండా ఈసారి సాంకేతికతకే కేంద్రం పెద్దపీట వేసింది. పాత నోటిఫికేషన్లను రద్దు చేస్తూ, తాజా షెడ్యూల్ ప్రకారం 2027 సెన్సస్ పనులు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే ఆప్షన్ ఉండటంతో.. ఈసారి జనాభా లెక్కల ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తయ్యే అవకాశముంది.
