- రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్
బషీర్‌బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం ద్వారా మరోసారి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్ గౌడ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో విల్సన్ మాట్లాడారు.
ఓబీసీ కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనిక్ కాస్ట్ కోడ్ లేకుండా కులగణన చేపట్టరాదన్నారు. అవసరమైతే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ వారి జనాభా 55 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు. కులగణన జరిగితేనే వాస్తవ జనాభా ఆధారంగా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
నమ్మించి గొంతు కోస్తున్న బీజేపీ..
రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఓబీసీలకు నెహ్రూ నుంచి మోదీ వరకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీజేపీ బీసీలను నమ్మించి గొంతు కోస్తోందని ఆరోపించారు. జనగణనలో ఈసారి ప్రత్యేక కోడ్‌లతో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని సూచించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ ఓబీసీ కులగణనకు దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
