మాల్దీవులకు మన బియ్యం, చక్కెర

మాల్దీవులకు మన బియ్యం, చక్కెర

న్యూఢిల్లీ :  మాల్దీవులకు నిత్యావసర సరుకులు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలతో పాటు మరికొన్ని వస్తువులు పంపుతున్నామని ప్రకటించింది. చైనా అండతో మాల్దీవుల సర్కార్ ఇండియాపై రెచ్చిపోతున్నది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయల ఎగుమతిలో ఇండియా అగ్రగామిగా ఉన్నది. 

2024– 2025 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మాల్దీవులకు సరుకులు ఎగుమతి ప్రారంభమైంది. కాగా, ఇక్కడి అవసరాలు, భౌగోళిక పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఎగుమతులపై ఆంక్షలు లేదా నిషేధం విధించే అవకాశాలు లేకపోలేదని కేంద్రం స్పష్టం చేసింది. 1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,09,162 టన్నుల గోధుమలు, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల ఆలుగడ్డలు, 35,749 టన్నుల ఉల్లిగడ్డలు, 427.50 మిలియన్ గుడ్లను మాల్దీవులకు కేంద్రం ఎగుమతి చేయనుంది. అదేవిధంగా, 1 మిలియన్ టన్నుల కంకర, నది ఇసుకను కూడా ఎగుమతి చేసేందుకు నిర్ణయించింది. అక్టోబర్​లో అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మొయిజ్జు.. ఇండియాపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.