కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో కేంద్రం సవరణలు

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో కేంద్రం సవరణలు


హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్​లో మూడు కీలక సవరణలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం తిరిగి వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు  జారీ చేసింది. నిరుడు జులై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది.

నిర్మాణంలో ఉన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్ లు గెజిట్ జారీ చేసిన రోజు నుంచి ఆరు నెలల్లోపు సమర్పించి అన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. అలాగే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అన్ని అనుమతులు తీసుకోవాలి.. ఒకవేళ తీసుకోలేకపోతే ఆయా ప్రాజెక్టులను నిర్వహించొద్దని గెజిట్ లోని నిబంధనల్లో చేర్చారు. అయితే ఆరు నెలల్లోనే ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడంలో ప్రాక్టికల్ గా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గెజిట్ లో సవరణలు చేసినట్టుగా కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు పర్మిషన్ తీసుకునే గడువును పొడిగించారు. రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ లు ఈ ఏడాది జులై 14 లోపు సీడబ్ల్యూసీకి సమర్పించి, వాటికి పర్మిషన్ తీసుకునేందుకు అవకాశం కల్పించారు.

రెండు రాష్ట్రాలు సీడ్ మనీ ఇచ్చే గడువును 60 రోజుల నుంచి ఏడాదికి పొడిగించారు. దీంతో ఈ ఏడాది జులై 14 వరకు సీడ్ మనీ ఆయా బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తోన్న సీతారామ ఎత్తిపోతలు, తుపాకులగూడెం, ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం) లిఫ్ట్, మోడికుంట వాగు, చౌట్ పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, చనకా ‌‌‌‌–- కొరాటా బ్యారేజీ, గూడెం ఎత్తిపోతల పథకం డీపీఆర్ లు సీడబ్ల్యూసీకి సమర్పించి అనుమతులు ఇవ్వాలని కోరింది.

కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ, రామప్ప -– పాకాల లేక్ డైవర్షన్ సహా మరో రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటికి అనుమతులు ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరింది. కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు –- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, తుమ్మిళ్ల, భక్తరామదాసు ఎత్తిపోతలతో పాటు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి విస్తరణ సహా పలు ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇప్పటికీ సీడబ్ల్యూసీకి ఇవ్వలేదు. వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు మిగులు జలాలపై చేపట్టినవి కావడంతో డీపీఆర్ ఇచ్చినా అనుమతులు వచ్చే ఆస్కారం లేదని ఇరిగేషన్ వర్గాలు భావిస్తున్నాయి.

వీటికి అపెక్స్ కౌన్సిల్ లోనే పరస్పర అవగాహన ద్వారా అనుమతులు పొందే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సీడ్ మనీని బోర్డులు ఏ అవసరానికి వినియోగిస్తారనే సమాచారం ఇస్తేనే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేసే ఆస్కారముందని అధికారులు అంటున్నారు. కేంద్రం చేసిన సవరణలతో గోదావరి ప్రాజెక్టులు గట్టెక్కుతాయని, కృష్ణా ప్రాజెక్టుల సంగతి ప్రభుత్వమే తేల్చాలని పేర్కొంటున్నారు.