
- 1.43 కోట్ల టన్నులకు 1.83 కోట్ల టన్నులు అందుబాటులో ఉంచామని కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: అవసరానికి మించి ఎరువులను అందుబాటులో ఉంచామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతులందరికీ సకాలంలో, సమానంగా ఎరువులు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ‘‘ఏటా సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రాష్ట్రాల వారీగా ఎరువుల అవసరాలను అంచనా వేస్తుంది. ఈ అంచనాల ఆధారంగా రాష్ట్రాలకు ఎరువులు కేటాయిస్తాం. ఇందులో భాగంగా ఖరీఫ్ సీజన్‌కు 1.43 కోట్ల టన్నుల యూరియా అవసరం ఉంటే, 1.83 కోట్ల టన్నుల యూరియా అందుబాటులో ఉంచాం.
అయితే గతేడాది ఆగస్టు 20తో పోలిస్తే ఈసారి యూరియా అమ్మకాలు 13 లక్షల టన్నులు కంటే ఎక్కువ పెరిగాయి” అని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నిల్వ చేయడం, అధిక ధర వసూలు చేయడంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ‘‘దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1,99,581 తనిఖీలు చేపట్టాం. 7,927 షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 3,623 లైసెన్సులు రద్దు చేశాం. 311 కేసులు నమోదు చేశాం” అని వివరించింది. రష్యా–-ఉక్రెయిన్, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగాయని పేర్కొంది.