యూసీసీ ఓ డిక్టేటర్ ఫార్ములా.. దేశం కన్నా హిందుత్వమే ముఖ్యమా?: అసద్

యూసీసీ ఓ డిక్టేటర్  ఫార్ములా.. దేశం కన్నా హిందుత్వమే ముఖ్యమా?: అసద్

న్యూఢిల్లీ, వెలుగు : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) లో భాగంగా దేశంలో ఒకే విధానం అమలు కావాలనడం డిక్టేటర్  ఫార్ములా లాగా ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ అన్నారు. గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. మణిపూర్  ఇష్యూతో పాటు మొత్తం 12 అంశాలపై మాట్లాడారు. దేశం కన్నా హిందుత్వమే ముఖ్యమన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో మైనారిటీ సంక్షేమాన్ని 40 శాతం తగ్గించారన్నారు. ఫ్రీ మెట్రిక్  స్కాలర్ షిప్ లు, ఫెల్లో షిల్ లు తగ్గాయని, మౌలానా ఆజాద్  ఫౌండేషన్ ను ఖతం చేశారని ఆరోపించారు. 

దీంతో ముస్లిం విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అయ్యారన్నారు. దేశంలో ఎన్నో ముస్లిం తెగలు ఉన్నా... కేంద్రంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చైనా విషయంలో ఎందుకు మాట మార్చారని ఒవైసీ ప్రశ్నించారు. తమిళనాడులో చైనా అధ్యక్షుడితో ఊయల ఊగిన విషయాన్ని గుర్తుచేశారు. సైనికుడైన కుల్ భూషణ్.. ఖతార్ జైల్లో ఉన్నా నేవీ అధికారుల ఆందోళన కేంద్రానికి పట్టదా? అని నిలదీశారు. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలకు బాధ్యులుగా అస్సాం రైఫిల్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్  చేశారు.