రాష్ట్రానికి వేయి కోట్ల ఫండ్స్.. పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఇవ్వనున్న కేంద్రం

రాష్ట్రానికి వేయి కోట్ల ఫండ్స్.. పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఇవ్వనున్న కేంద్రం
  • డబుల్ ఇండ్ల వివరాలను అప్ లోడ్ చేస్తున్న అధికారులు
  • రాష్ర్ట వ్యాప్తంగా 96 వేల ఇండ్ల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టానికి పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద  రూ. వేయి కోట్లు నిధులు రానున్నాయి. రాష్ర్టంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు  కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లో భాగంగా..   ఒక్క ఇంటికి అర్బన్ ఏరియాల్లో రూ.1,50,000 , రూరల్ ఏరియాల్లో రూ.72 వేలు ఇస్తోంది.  ఈ అమౌంట్ ను  కేంద్రం మూడు దశల్లో  చెల్లించనుంది. అన్ని రాష్ర్టాల్లో లబ్ధిదారుల పేర్లు పంపితేనే  కేంద్రం నిధులు విడుదల చేస్తోంది. తెలంగాణ మాత్రం డబుల్ ఇండ్లను నిర్మించి, లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపికచేసిన తరువాత ఇండ్లను అందజేస్తోంది. దీంతో గత 9 ఏండ్ల నుంచి కేంద్రం రూ.200 కోట్లను మాత్రమే మంజూరు చేసింది.  రూరల్ ఏరియాల్లో ఇండ్లకు రూ.195 కోట్లను మంజూరు చేసింది. అయితే అక్కడ ఇండ్ల నిర్మాణం నిదానంగా సాగుతుండటం, లబ్ధిదారులను ఎంపిక చేయకపోవటంతో ఈ నిధులను కేంద్రం వెనక్కి తీసుకుంది. త్వరలో రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో   గత నెల రోజుల నుంచి ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా డబుల్ ఇండ్లను అందజేస్తోంది. రూరల్ ఏరియా, అర్బన్, జీహెచ్ ఎంసీ లో పంపిణీ చేసిన ఇండ్లు, లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్, అన్ని వివరాలను పీఎం ఆవాస్ యోజన పోర్టల్ లో అధికారులు అప్ లోడ్ చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 96 వేల డబుల్ ఇండ్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.