గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్టు గెజిట్ ఇవ్వండి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్టు  గెజిట్ ఇవ్వండి.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు గెజిట్ రిలీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి, సీఎస్, అసెంబ్లీ ఈసీఐ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్​కు లేఖలు రాసింది. లేఖలకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ..  గద్వాల ఎమ్మెల్యేగా బీ.కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును లేఖలో ప్రస్తావించింది. 

గత నెల 24న  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా డీకే అరుణను ఎమ్మెల్యేగా స్టేట్ గెజిట్ రిలీజ్ చేయాలని నిర్ధేశించింది. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ –1951 పరిధిలోని సెక్షన్ 106(బీ) మేరకు 2018 డిసెంబర్ నుంచి డీకే అరుణ  గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు  ప్రచురించాలని సూచించింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి చేతిలో డీకే అరుణ ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణ మోహన్ తప్పుడు వివరాలు పొందుపరిచారన్న కారణంగా ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతోపాటు రూ. 2.50 లక్షల ఫైన్ విధించింది, పిటిషనర్ అరుణకు కోర్టు ఖర్చుల కింద రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

ప్రమాణ స్వీకారం చేయించాలి: డీకే అరుణ

గద్వాల, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనను ఎమ్మెల్యేగా  ప్రమాణ స్వీకారం చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డీకే అరుణ కోరారు. గద్వాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారం ఉందని గత ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరించారన్నారు. పంచాయతీరాజ్​చట్టం పేరుతో  సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లను పదవుల నుంచి తొలగించారన్నారు.