
- ఆ ఏరియాను కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాంతంగా గుర్తించాలి
- 11 సిఫారసులతో 288 పేజీల రిపోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూమిని అటవీ భూమిగా ప్రకటించి, నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని సుప్రీంకోర్టుకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ( సీఈసీ) సిఫారసు చేసింది. జీవవైవిధ్యం, వన్యప్రాణుల ఉనికిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర అటవీ చట్టాల ప్రకారం కంజర్వేషన్ రిజర్వ్ ప్రాంతంగా గుర్తించాలని కోరింది. 11 సిఫారసులు చేసింది. మొత్తం 288 పేజీలతో కూడిన రిపోర్ట్ ను మంగళవారం సుప్రీంకోర్టు సమర్పించింది. ఇందులో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2023 ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం, జిల్లాల వారీగా వాటి వివరాలు, వృక్ష జాతులు, బుల్డోజర్లతో తొలగించిన అటవీ ప్రాంతం, మొత్తం 400 ఎకరాల్లో అటవీ, ఇతర ప్రాంతాలు, కోర్టు ఆదేశాల తర్వాత చేపట్టిన చర్యలు, ఇతర వివరాలను పొందుపరిచింది.
కంచ గచ్చిబౌలిలోని చెట్లను నరికేసిన స్థలంలో రాబోయే వర్షాకాలంలో అటవీ శాఖ ద్వారా స్థానిక చెట్లు, పొద జాతుల మొక్కలు పెంచి అసలు ఆకృతికి పునరుద్ధరించాలని సూచించింది. అవసరమైన నేల, తేమ పరిరక్షణ కార్యకలాపాలను కూడా అదే సమయంలో చేపట్టాలని సిఫారసు చేసింది. 104.95 ఎకరాల్లో అటవీని తుడిచి పెట్టారని సీఈసీ రిపోర్ట్ లో వెల్లడించింది. కొద్ది మొత్తంలో ఉన్న వాటర్ బాడీని సైతం లేకుండా చేశారని పేర్కొంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్-2025 ప్రకారం... కంచ గచ్చిబౌలిలో మొత్తం 409.12 ఎకరాలు ఉంది. ఇందులో కేవలం 28.97 ఎకరాలు అంటే 7.08 శాతం వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉందని రిపోర్ట్‌లో పేర్కొంది.
అలాగే 130 ఎకరాల్లో మోడ్ డెన్న్స్ ఫారెస్ట్ , 70.23 ఎకరాల్లో ఓపెన్ ఫారెస్ట్, 158.87 ఎకరాల్లో నాన్ ఫారెస్ట్ భూమిగా గుర్తించినట్లు తెలిపింది. వివాదం నెల కొన్న 104. 95 ఎకరాలకు సంబంధించిన ఫారెస్ట్ వివరాలను మెన్షన్ చేసింది. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఈసీ పేర్కొంది. ఈ ప్రాంత సమగ్ర పర్యావరణ అంచనాను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా ఇలాంటి ప్రసిద్ధ సంస్థ నిర్వహించాలని సిఫారసు చేసింది.
ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి
హెచ్‌సీయూ క్యాంపస్ వెలుపల తగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని సీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. క్యాంపస్‌లోకి ప్రవహించే అన్ని మురుగునీటి ఔట్లెట్లను ఏడాదిలోపు మూసివేసేలా జీహెచ్ఎంసీకి ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను గుర్తించడానికి ఇందులో ఫీల్డ్ ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలను చేర్చాలని కోరింది.
జీవావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు
కంచ గచ్చిబౌలిలోని 100 ఎకరాల్లో పర్యావరణ, జీవావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని సుప్రీంకోర్టుకు సీఈసీ నివేదించింది. ఈ భూ వ్యవహారంలో గత ఆదేశాలను అన్ని విధాలుగా పాటిస్తున్నదని ప్రస్తావించింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సంస్థ, వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. చెట్లు నరికిన 100 ఎకరాల్లో జంతువుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వ వైల్డ్ లైఫ్ వార్డెన్ లు చర్యలు చేపట్టారని తెలిపింది.
ఈ 100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్య ప్రాణులను పరిశీలించి, వాటిని రక్షించడానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా ఐదుగురితో కూడిన బృందం 3 షిప్ లు పెట్రోలింగ్ చేస్తున్నదని తెలిపింది. స్ట్రే డాగ్స్ నుంచి వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతున్న ఫొటోలను జత చేసింది. అలాగే ఫారెస్ట్ ప్రివెంటీవ్ మెజర్స్, వన్య ప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలు, యాంటి పోచింగ్ స్క్వాడ్, తాత్కాలిక నీటి గుంటలు, సేంద్రియ ఎరువు వంటి చర్యల డేటా, ఫొటోలను రిపోర్టులో జత చేసింది.
టీజీఐఐసీకి రూ. 5 లక్షల ఫైన్
వివాదాస్పద 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలం గాణ ఇండస్ట్రీయల్ ఇన్పాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ)కి అప్పగించినట్లు తాము గుర్తించామని సీఈసీ పేర్కొంది. ఇందులో ఫస్ట్ ఫేస్‌లో భాగంగా 122 ఎక రాల(49.63 హెక్టార్లు) భూమిలో టీజీఐఐసీ పనులకు ప్రయత్నించిందని తెలిపింది. కాంట్రాక్టర్ గోవింద కృష్ణ ఈ స్థలంలోని భారీ వృక్షాలను పెద్ద పెద్ద మిషీన్లతో తొలగించినట్లు గుర్తించామంది. వాల్టా యాక్ట్ – 2002, సెక్షన్ 24 (4) లోని నిబంధనల ప్రకారం.. ఎవరైనా యజమాని ఒక చెట్టును నరికి వేయాలంటే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి అని చెప్తున్నదని గుర్తుచేసింది. ఫారం 13 ఏ లో నిర్ణీత రుసుము చెల్లించి అటవీ డివిజనల్ ఆఫీసర్ కు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది.
కానీ, అటవీ రేంజ్ ఆఫీసర్ తనిఖీ చేసిన సమయంలో వివాదాస్పద భూముల్లో మినహాయింపులేని 125 జాతుల చెట్లను నరికి వేసినట్లు గమనించారని, దీనిపై డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లకు సమాచారం ఇచ్చారని పేర్కొంది. నిబంధనల అతిక్రమణపై చర్యలు తీసుకొని టీజీఐసీసీ కి రూ.5 లక్షల ఫైన్ వేసినట్లు సీఈసీ చైర్మన్ కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సి.సువర్ణ రాసిన లేఖను రిపోర్టులో సీఈసీ పొందుపరించింది.