- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
 
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫానుతో ప్రభావితమైన జిల్లాల్లో తగిన చర్యలు చేపట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పంట, ఆస్తి నష్ట నివారణ చర్యల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన చెరుకు సుధాకర్ హైకోర్టులో పిల్ మెమో దాఖలు చేశాడు.
ఈ మెమోపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీ.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదిస్తూ..మొంథా తుపానుతో ఆరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. వరంగల్, హనుమకొండ జంట నగరాలు 48 గంటలపాటు పూర్తిగా ముంపులోనే ఉన్నాయన్నారు. తాగునీరు, ఆహారం, ప్రాథమిక వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏజీపీ వాదిస్తూ..ప్రభుత్వం నుంచి వివరాలు పొంది సమర్పించేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరగా, అనుమతించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
