మహిళా కానిస్టేబుల్‌‌ ఆత్మహత్యాయత్నం

మహిళా కానిస్టేబుల్‌‌ ఆత్మహత్యాయత్నం
  • సీఐ వేధింపులే కారణమని ఆరోపణ
  • ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్‌‌ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే సీఐ వేధింపులే కారణమని కానిస్టేబుల్‌‌ కుటుంబ సభ్యులు ఎక్సైజ్‌‌ ఆఫీస్‌‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వీఎం బంజరకు చెందిన అఖిల కొత్తగూడెం సర్కిల్‌‌ ఎక్సైజ్‌‌ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌‌గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని వెళ్లిన అఖిల ఇంటికి వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్‌‌కు తీసుకెళ్లి ట్రీట్‌‌మెంట్‌‌ అందించారు. తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకోగా.. సీఐ వేధింపులు తట్టుకోలేక ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు అఖిల కుటుంబ సభ్యులకు చెప్పింది. 

దీంతో వారు సోమవారం ఎక్సైజ్‌‌ స్టేషన్‌‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అఖిలను సీఐ అంటరానివారిగా చూస్తున్నారని, ఆఫీస్‌‌లో ఎవరితో మాట్లాడినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అఖిలతో మాట్లాడిన వారిని సైతం సీఐ బెదిరిస్తున్నారని వాపోయారు. సీఐ వేధింపులు తట్టుకోలేక అఖిల ఆత్మహత్యకు యత్నించిందని ఆరోపించారు. ఈ విషయంపై ఎక్సైజ్​సీఐ జయశ్రీ మాట్లాడుతూ.. అఖిల ఆత్మహత్యకు యత్నించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఆమెను ఇబ్బంది పెట్టలేదని, తనతో కూడా బాగానే ఉంటుందని చెప్పారు.