తప్పిన మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

తప్పిన మరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
  • హెచ్చరిక బోర్డులు లేకుండా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో ప్రమాదం
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో మరో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ వద్ద ఆర్టీసీ,  ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఏపీలోని పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తున్నది. సోమవారం తెల్లవారుజామున శేరిగూడ దగ్గరకు రాగానే.. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆర్టీసీ బస్సు స్లో అయింది.

అదే టైమ్​లో దోస్త్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక భాగం, ట్రావెల్స్ బస్సు ముందు భాగం దెబ్బతిన్నాయి. 2 బస్సుల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే.. ప్రయాణికులంతా దిగి మరో బస్సులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో హైవేపై దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఆ స్పీడ్ బ్రేకర్ వల్లే ప్రమాదం!

వారం రోజుల కిందే రోడ్డు, భవనాల శాఖ అధికారులు ఈ స్పీడ్ బ్రేకర్​ను ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ కారణంగానే ఇటీవల 2 ప్రమాదాలు జరిగాయి. దీంతో అధికారులు ఆ స్పీడ్ బ్రేకర్ ను తొలగించారు. ఆదివారం మళ్లీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా స్పీడ్ బ్రేకర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. స్పీడ్​ బ్రేకర్లు వేస్తే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాద ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.