న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీల వల్ల ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. టెకీలు భయభయంగా బతుకుతున్నారు. కేవలం ఒక మెసేజ్‌తో కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఈ ఏడాది లక్ష మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ డేటా ప్రకారం, 2025లో ఇప్పటివరకు 218 టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. దీనివలన ప్రపంచవ్యాప్తంగా 1,12,700 కంటే ఎక్కువ మంది ఉపాధి కోల్పోయారు. అమెజాన్, ఇంటెల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వంటి పెద్ద కంపెనీలు ఈ ఉద్యోగాల తొలగింపులో ముందున్నాయి.
వృద్ధి మందగమనం, కరోనా సమయంలో అధిక నియామకాలు, ఏఐ ఆధారిత ఆటోమేషన్ వైపు వేగంగా మళ్లడం వంటివి ఇందుకు కారణాలు. అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద జాబ్కట్స్ను ప్రకటించింది. 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందులో ఆపరేషన్స్, హెచ్‌ఆర్, డివైజెస్, ఏడబ్ల్యూఎస్ యూనిట్ల ఉద్యోగాలు ఉన్నాయి. మనుషులకు బదులు ఇది ఏఐ, రోబో టెక్నాలజీలను భారీగా వాడుతోంది. చిప్ మేకర్ ఇంటెల్ దాదాపు 22 శాతం అంటే 24వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. యూఎస్, జర్మనీ, కోస్టారికా, పోలాండ్‌తో సహా పలు ప్రాంతాల్లోని మాన్యుఫాక్చరింగ్, ఆర్ అండ్ డీ విభాగాలలో ఈ తొలగింపులు జరుగుతున్నాయి. పీసీ డిమాండ్ మందగించడంతోపాటు పోటీ కంపెనీల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.
టీసీఎస్‌లో 20 వేల మంది ఇంటికే
మనదేశంలో అతిపెద్ద ఐటీ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా చరిత్రలో మొదటిసారి ఒక క్వార్టర్‌లోనే.. అంటే ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో 19,755 మందిని తగ్గించింది. దీంతో 2022 తర్వాత తొలిసారిగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల దిగువకు పడిపోయింది. ఏఐ ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యం కోసం కంపెనీ ఈ మార్పులు చేస్తోంది. యాక్సెంచర్ ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఏఐ సామర్థ్యాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై కన్సల్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ నిర్ణయం తీసుకుంది.
మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ, క్లౌడ్ పెట్టుబడులను పెంచడానికి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించింది. సేల్స్‌ఫోర్స్ కస్టమర్ సపోర్ట్‌లో ఏఐ పాత్ర పెరుగుతున్నందున నాలుగు వేల ఉద్యోగాలను తగ్గించింది. సిస్కో 4,250 మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ క్లౌడ్, ఆండ్రాయిడ్, పిక్సెల్ విభాగాలలో వందలాది ఉద్యోగులను పీకేసింది. మెటా తన ఏఐ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించింది. ఒరాకిల్ కూడా క్లౌడ్ సేవలు, ఏఐ మౌలిక సదుపాయాల వైపు ఖర్చులను మళ్లించడానికి వందలాది ఉద్యోగాలను తొలగించింది.
నాన్-టెక్ కంపెనీలు కూడా..
నాన్–టెక్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. ఆటోమేషన్, డెలివరీలు తగ్గడం వల్ల అమెరికాకు చెందిన లాజిస్టిక్స్కంపెనీ యూపీఎస్ డెలివరీ డ్రైవర్లతో సహా 48 వేల ఉద్యోగాలను తొలగించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరగడంతో ఫోర్డ్ మోటార్స్ 13వేల ఉద్యోగాలను తగ్గిస్తోంది. పీడబ్ల్యూసీ ఆడిట్, ట్యాక్స్ విభాగాలలో 5,600 పోస్టులను తొలగించి, ఏఐ ఇంటిగ్రేషన్ యూనిట్లను విస్తరిస్తోంది.
పారామౌంట్ గ్లోబల్ స్ట్రీమింగ్ నష్టాలు, ప్రకటనల ఆదాయాలు తగ్గడం వలన రెండు వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ విప్లవం కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, సాంప్రదాయ ఉద్యోగాలకు శాపంగా మారింది. కంపెనీలు జనరేటివ్ ఏఐ, క్లౌడ్ టెక్నాలజీల్లో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి. దీంతో సంప్రదాయ ఉద్యోగుల అవసరం తగ్గుతోంది.
