కశ్మీర్​లో ఎటు చూసినా జవాన్లే.. రంగంలోకి దిగిన అదనపు బలగాలు

కశ్మీర్​లో ఎటు చూసినా జవాన్లే.. రంగంలోకి దిగిన అదనపు బలగాలు

10 జిల్లాల్లో సెక్యూరిటీ పెంపు

ఎక్కడచూసినా బారికేడ్లు.. అణువణువునా తనిఖీలు

ఎల్వోసీకి దగ్గర్లోని కేరాన్లో భారీగా ఆయుధాల పట్టివేత

నిత్యావసరాల కోసం భారీ క్యూలైన్లు

ఢిల్లీలోనూకాశ్మీర్హడావిడీ.. కీలక విభాగాల బాస్​లతో  అమిత్ షా మీటింగ్స్

నేడు కేంద్ర కేబినెట్​ భేటీ.. కీలక నిర్ణయం?

రాజ్యసభ ముందుకు నేడుజమ్మూకాశ్మీర్ రిజర్వేషన్​​బిల్లు

స్టేటస్​ను కాపాడుకుంటామని కాశ్మీర్ పార్టీల తీర్మానం

 

టెర్రర్​ అటాక్​ జరగొచ్చన్న కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్​లోయలో వరుసగా మూడోరోజూ టెన్షన్​ వాతావరణం కొనసాగింది. కేంద్రం పంపిన 30వేల అదనపు బలగాలు ఆదివారం ఉదయానికే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. శ్రీనగర్​ సహా  వ్యాలీలోని 10 జిల్లాల్లో సెక్యూరిటీ టైట్​ చేశారు. సెన్సిటివ్​ ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని మోహరింపజేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోని మెయిన్​ రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటుచేసి, వెహికల్స్​ను చెక్​ చేస్తున్నారు. రోజురోజుకూ సెక్యూరిటీ మరింత పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలను రెట్టింపయ్యాయి. ఆయిల్​, గ్యాస్​ సహా ఇతర నిత్యావసరాల కోసం బంకులు, షాపుల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడటం కనిపించింది. పర్మిషన్​ లేకుండా పెట్రోల్​, డీజిల్​ అమ్మరాదంటూ వ్యాలీలోని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఇంటర్నెట్​ సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఇక నాన్​ లోకల్స్​ని వెనక్కి పంపే పక్రియ దాదాపు పూర్తికావచ్చింది. శ్రీనగర్​ నుంచి జమ్మూ చేరుకున్న నిట్ విద్యార్థుల్ని స్పెషల్​ ట్రైన్లలో సొంత ప్రాంతాలకు పంపేశారు. ప్రత్యేక బస్సుల్లో అమర్​నాథ్​ యాత్రికులు, ఇతర టూరిస్టుల్ని వ్యాలీ నుంచి బయటికి తరలించారు. రిజర్వేషన్​ లేకున్నా రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఇదే అదనుగా శ్రీనగర్​–ఢిల్లీ విమాన టికెట్​ ధరను పెంచేసిన ప్రైవేటు విమానయాన సంస్థలకు.. క్యాప్​విధించడం ద్వారా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటు ఢిల్లీలోనూ కాశ్మీర్ అంశమే ప్రధానంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

చొరబడ్డ టెర్రరిస్టులు.. సమీప గ్రామాల్లో ఆయుధాలు..

బుధ, గురువారాల్లో ఎల్​వోసీ వెంబడి పలు చోట్ల టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించినట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ క్రమంలో కుప్వారా జిల్లాలో ఎల్​వోసీకి దగ్గరగా ఉన్న కేరాన్​ సెక్టార్​లో  జరిగిన కాల్పుల్లో ఎడుగురు చొరబాటుదారులు హతమైనట్లు శనివారం అధికారులు వెల్లడించారు. చొరబాట్లను తిప్పికొట్టే ప్రయత్నం గట్టిగానే జరిగినప్పటికీ జైషే మొహ్మద్​(జేఈఎం)కు చెందిన టెర్రరిస్టు టీమ్​లు లోనికి చొచ్చుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అమర్​నాథ్​ యాత్రికులపై దాడులు చేయడమే లక్ష్యంగా టెర్రరిస్టులు ప్రవేశించారని తెలియడంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం యాత్రను నిలిపేయడంతోపాటు నాన్​లోకల్స్ అందరినీ కాశ్మీర్​ వ్యాలీ నుంచి వెనక్కి పంపేస్తోంది. ఎల్​వోసీకి దగ్గరగా కాల్పులు చోటుచేసుకున్న కేరాన్​ ఏరియాలో ఆదివారం కేంద్ర బలగాలు, జమ్మూకాశ్మీర్​ పోలీసులు కలిసి నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున ఆయుధాలు బయటపడటం టెన్షన్​ను మరింత పెంచింది. కేరాన్​ గ్రామంలోని ఓ టైలర్​ షాపు నుంచి15 హ్యాండ్​ గ్రేనేడ్లను స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. షాపు ఓనర్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎల్​వోసీకి సమీపంగా ఉన్న గ్రామాల్లో మరికొన్ని చోట్ల ఆయుధాల డంపులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సెన్సిటివ్​ ఏరియాల్లో ఎక్కువ మంది బలగాలను మోహరింపజేశారు.

ఆదివారం నాడూ అమిత్​ షా రివ్యూలు

సెలవురోజైన ఆదివారం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వరుస మీటింగ్​లతో బిబీబిజీగా గడిపారు. పార్లమెంట్ ఆవరణలోని తన ఆఫీసులో కీలక విభాగాల బాస్​లతో మాట్లాడారు. చేశారు. నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్​ అజిత్​ దోవల్​, ఇంటెలిజెన్స్ చీఫ్​ అర్వింద్​ కుమార్​, రా చీఫ్​ సమంత్​ గోయల్​, హోం శాఖ సెక్రటరీ రాజీవ్​ గౌభాతో  అమిత్​ షా రెండుగంటలకుపైగా మాట్లాడారు. కాశ్మీర్​ అంశమే ప్రధానంగా ఈ మీటింగ్​ జరిగినట్లు సమాచారం. కాశ్మీర్​ వ్యవహారాల్ని పర్యవేక్షించే హోం మినిస్ట్రీ అడిషనల్​ సెక్రటరీతోనూ షా విడిగా సమావేశమయ్యారు. జమ్మూకాశ్మీర్​లో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో10 శాతం రిజర్వేషన్​ కల్పించే బిల్లును అమిత్​ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాశ్మీర్​పై కేంద్ర కేబినెట్​ తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా ఆయనే పార్లమెంట్​కు వెల్లడించే అవకాశముంది.

కేంద్రానికి కాశ్మీరీ పార్టీల విజ్ఞప్తి​​

జమ్మూకాశ్మీర్​లో టెన్షన్​ నివారించాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. నేషనల్​ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్​ అబ్దుల్లా ఇంట్లో ఆదివారం సాయత్రం కాశ్మీరీ పార్టీల జాయింట్​ మీటింగ్​ జరిగింది. దీనికి పీడీపీ చీఫ్​, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా అన్ని పార్టీల లీడర్లు హాజరయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూకాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ను వదులుకోబోమని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన స్టేటస్​ను కేంద్రం ఎత్తేస్తే చూస్తూ ఊరుకోబోమని మీటింగ్​లో తీర్మానాలు చేశారు. టెన్షన్​ పెంచొద్దని అటు పాక్​ ప్రభుత్వాన్నీ కోరుతున్నట్లు నేతలు చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే సెపరేటిస్టుల్ని జైళ్లలో  పడేసిన కేంద్ర సర్కార్​.. ఇప్పుడు రాజకీయ నేతలనూ టార్గెట్​ చేసింది. ఎన్సీ నేత ఫరూఖ్​ అబ్దుల్లాకు ఈడీ ఉచ్చుబిగించిన రెండ్రోజులకే పీడీపీ చీఫ్​ ముఫ్తీకి ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయి. బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఏసీబీ ఆదివారం ఆమెకు నోటీసులు పంపింది.

నేటితో టెన్షన్కు తెర?

నాలుగు రోజులుగా కాశ్మీర్​ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మోడీ సర్కార్​ ఏ నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ తారాస్థాయికి చేరింది. టెన్షన్​ను నివారించేలా కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కేబినెట్​ భేటీ కీలకంగా మారింది. సాధారణంగా ప్రతి బుధవారం కేంద్ర సెక్రటేరియట్​ సౌత్​ బ్లాక్​లోనే  ప్రధాని మోడీ ​ కేబినెట్ మీటింగ్​ నిర్వహిస్తారు. అలాంటిది ఈసారి మాత్రం మీటింగ్​ను సోమవారానికి ప్రీపోన్​ చేయడంతోపాటు వేదికను ప్రధాని అధికార నివాసమైన 7, లోక్​కల్యాణ్​ మార్గ్​కు మార్చారు. ఈ మీటింగ్​లో కాశ్మీర్​ అంశమే ప్రధాన అజెండాగా ఉండొచ్చని, కేబినెట్​ తీసుకోబోయే నిర్ణయాల్ని ఇదే రోజు పార్లమెంట్​లోనూ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే 370 ఆర్టికల్​, నాన్​లోకల్స్​కు ఇబ్బందిగా మారిన 35ఏ ఆర్టికల్​ను ఎత్తేస్తారనే ఊహాగానాలతోపాటు పాక్​ ఆధీనంలో ఉన్న కాశ్మీర్​నూ స్వాధీనం చేసుకునే దిశగా నిర్ణయాలు వెలువడొచ్చని స్వత్రా చర్చ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన జమ్మూకాశ్మీర్ గవర్నర్​ మాత్రం వీటిని కొట్టిపారేశారు. ‘‘ఏం చేసినా అందరికీ చెప్పే చేస్తాం. సోమ, మంగళవారాల్లో దీనిపై ఓ క్లారిటీ వస్తుంది’’అని గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ చెప్పారు. ఆగస్టు 15న శ్రీనగర్​లోని లాల్​ చౌక్​లో ప్రధాని మోడీ జెండా ఎగరేస్తారని, అందుకోసమే సెక్యూరిటీని పెంచారన్న వాదననూ కేంద్రం నిరాకరించింది. కాగా, ఇండిపెండెన్స్​ డే నాడు కాశ్మీర్​ లోయలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగరేసేందుకే సెక్యూరిటీ పెంపు తదితర తతంగం జరుగుతున్నట్లు ‘ది ప్రింట్​’ ఓ కథనాన్ని ప్రచురించింది.

అప్రమత్తమైన పాక్​​.. ఇమ్రాన్ ఆరోపణలు

కాశ్మీర్​లోయలో వేగంగా మారుతోన్న పరిణామాలకు పాక్​లో వణుకు మొదలైంది. ఎల్​వోసీ వద్ద పాక్​ చొరబాటుదారుల కాల్చివేతలు, శవాల్ని తీసుకెళ్లండంటూ ఇండియా చేసిన ప్రకటనపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ సమాలోచనలు చేశారు. అదివారం హుటాహుటిన నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​ మీటింగ్​ను నిర్వహించిన ఆయన, ఆ తర్వాత ఇండియాపై ఆరోపణలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎల్​వోసీ వద్ద అమాయకులపై ఇండియా బలగాలు దాడులు చేస్తున్నాయని, ఒప్పందాలకు విరుద్ధంగా నిషేధిత క్లస్టర్‌‌ వెపన్స్​ను వాడుతోందని విమర్శించారు. దీనిపై యునైటెడ్‌‌ నేషన్స్‌‌ సెక్యురిటీ కౌన్సిల్‌‌(యూఎన్‌‌ఎస్‌‌సీ) వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ చేసిన మీడియేషన్​ ప్రతిపాదననూ ఇమ్రాన్​ గుర్తుచేశారు. ‘‘కాశ్మీర్​ వివాదాన్ని పరిష్కరించడంలో మీడియేషన్​ చేయడానికి డొనాల్డ్
ట్రంప్‌‌ ముందుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా దూకుడుగా వ్యవహరిస్తూ సరిహద్దు వద్ద టెన్షన్​ పెంచుతోంది. పరిస్థితులు మరింత దిగజారితే ప్రాంతీయ సంక్షోభం తలెత్తుతుంది”అని ఇమ్రాన్​ కామెంట్​ చేశారు. పాక్​ పీఎం కామెంట్లపై కేంద్రం ఇంకా స్పందించాల్సిఉంది.