హైదరాబాద్​కు 11 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్​కు 11 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 11 కంపెనీల సెంట్రల్  ఆర్మ్​డ్​ పోలీస్‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌ (సీఏపీఎఫ్‌‌‌‌)కు చెందిన 1,500 మంది సిబ్బందిని బందోబస్తులో వినియోగించనున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సందీప్ శాండిల్య బలగాల మోహరింపుపై సోమవారం సమీక్ష జరిపారు. బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్‌‌‌‌ అండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఐదుగురు సీఏపీఎఫ్‌‌‌‌ కమాండెంట్స్‌‌‌‌ పాల్గొన్నారు. అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) విక్రమ్‌‌‌‌ సింగ్ మాన్‌‌‌‌, సీఏపీఎఫ్‌‌‌‌ డిప్యూటీ కమాండెంట్‌‌‌‌ సంతన కృష్ణతో కలిసి బలగాల కేటాయింపులు చేశారు. ప్రధానంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌‌‌‌, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ వద్ద విధులు నిర్వహించాలని సీపీ సందీప్ శాండిల్య చెప్పారు. 

ఐదు జోన్లకు కేటాయింపులు..

రాష్ట్రంలో పోలింగ్‌‌‌‌ ముగిసే వరకు 1,500 మంది సీఏపీఎఫ్‌‌‌‌ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి విధులు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని ఐదు జోన్ల పరిధిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించారు. సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌కు అవసరమైన షెల్టర్‌‌‌‌‌‌‌‌, వసతులు స్థానిక ఏసీపీలకు అప్పగించారు. చెక్‌‌‌‌ పోస్టులు, వెహికల్ చెకింగ్స్‌‌‌‌ వద్ద సీఏపీఎఫ్‌‌‌‌ సిబ్బంది కూడా డ్యూటీ నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామని సీపీ శాండిల్య తెలిపారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించామన్నారు. అడిషనల్ సీపీ విక్రమ్‌‌‌‌ సింగ్ మాన్‌‌‌‌ బందోబస్తును పర్యవేక్షించనున్నారని, పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయన ఆధ్వర్యంలోనే సీఏపీఎఫ్‌‌‌‌ బలగాలు విధులు నిర్వహించనున్నాయని వెల్లడించారు.