- పీజీ సీట్ల పెంపునకు రూ.379 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- ఎంబీబీఎస్ సీట్లు పెరిగిన 4 కాలేజీలకు మరో రూ.108 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి టీచింగ్ హాస్పిటళ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద రూ.379.29 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర హెల్త్ సెక్రటరీకి లేఖ రాసింది. రాష్ట్ర వాటా మరో రూ.253 కోట్లు కలిపి మొత్తం రూ.632 కోట్లతో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
గత రెండేండ్లలో రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 465 పీజీ సీట్లు పెరిగాయి. ఒక్కో పీజీ సీటుకు సగటున రూ.81.57 లక్షల చొప్పున కేంద్రం నిధులు అందించనుంది. ఈ ఏడాది ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 110 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు కాలేజీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.108 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఇందులో కేంద్రం రూ.64 కోట్లు ఇవ్వనుండగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
